జనవాణి: సినిమా డెస్క్ August 24: టాలీవుడ్‌లో తనదైన సినిమాటిక్ యూనివర్స్‌ను నిర్మిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘మహాకాళి’లో శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నాను పరిచయం చేస్తూ తాజాగా టీజర్ విడుదల చేశారు. ఆయన లుక్, పాత్రను పరిచయం చేసిన తీరు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా
‘మహాకాళి’లో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌లో ఆయన పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేశారు. గంభీరమైన లుక్, పాత్రలోని తీవ్రత సినిమాకు కీలకమైన మలుపు ఉండబోతుందనే సంకేతాలను ఇస్తున్నాయి.
‘పెద్దమ్మ చూస్తుంది రా!’
టీజర్ విడుదల సందర్భంగా ప్రశాంత్ వర్మ చేసిన పోస్టు కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘పెద్దమ్మ చూస్తుంది రా!’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యతో పాటు మహాకాళి, శంక్రాంతి 2027 హ్యాష్‌ట్యాగ్‌లు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పూజా కొల్లూరు దర్శకత్వంలో..
‘మహాకాళి’ చిత్రానికి పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆర్కే దుగ్గల్ సమర్పిస్తుండగా.. రివాజ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. ఆర్‌కేడీ స్టూడియోస్, పీవీసీయూ బ్యానర్లపై ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.
భారీ తారాగణం
అక్షయ్ ఖన్నాతో పాటు ఈ చిత్రంలో శ్రీయా రెడ్డి, రోహిత్ సరాఫ్, భూమి శెట్టి, ఖుష్ సుందర్, రాకేశ్ బేడీ, రాజత్ కపూర్, మురళీ శర్మ, నాజర్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు సురేశ్ రఘు సినిమాటోగ్రఫీ, శ్రీనాగేంద్ర ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా..
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ‘మహాకాళి’పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. పురాణ నేపథ్యాన్ని ఆధునిక సినిమా శైలితో మిళితం చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడిస్తోంది. తాజాగా శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా పరిచయం కావడంతో కథలో ఆయన పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందనే చర్చ మొదలైంది.
2027 సంక్రాంతికి రిలీస్
‘మహాకాళి: శుక్రాచార్యాస్ వార్ క్రై’ పేరుతో విడుదలైన టీజర్‌లో ‘ది ఎండ్ బిగిన్స్’ అంటూ చిత్రబృందం ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. 2027 జనవరి 8న సినిమా ను రిలీస్ చేస్తున్నట్లు ప్రకటించారు.




















