‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ది ప్యారడైజ్’. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. పలువురు సినీ విమర్శకులు నెగెటివ్ రివ్యూస్ ఇవ్వడంతో పాటు.. సోషల్ మీడియాలోనూ సినిమాపై ట్రోల్స్ కనిపించాయి.
ఈ నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’పై వస్తున్న స్పందనకు హీరో నాని స్వయంగా రియాక్ట్ అయ్యాడు. ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమతో పాటు సరదా ట్రోల్స్‌ను కూడా స్వీకరిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. “ది ప్యారడైజ్ సినిమాపై మీ అభిప్రాయాలు, స్పందన అన్నింటినీ చూశా. మీరు చూపించిన ప్రేమతో పాటు సరదా ట్రోల్స్‌ను కూడా స్వీకరిస్తున్నా. ఈ సినిమాను తమ సినిమాగా ప్రేక్షకులు స్వీకరించిన తీరు నా హృదయానికి హత్తుకుంది” అని నాని పేర్కొన్నాడు.
అదే సమయంలో సినీ విమర్శకులు, రివ్యూవర్లు ప్రస్తావించిన లోటుపాట్లు, పొరపాట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటానని చెప్పాడు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో రక్తం, చెమట చిందించి సినిమాను రూపొందించామని నాని తెలిపాడు. సినిమాను ప్రేక్షకులు సంబరంగా చేసుకోవచ్చని, విమర్శించవచ్చని పేర్కొంటూ తనపై చూపించిన ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశాడు నాని.
Loading Tweet...




















