విలన్‌గా ప్రదీప్ రావత్ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?

టాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రదీప్ రావత్ మరణం సినీ అభిమానులను విషాదంలో ముంచేసింది. అయితే ఆయన సినీ ప్రయాణంతో పాటు ఆస్తులు, పారితోషికం గురించి కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.

5 ఆగస్టు, 2026 9:45 AM•ByLaharika

Share this article

విలన్‌గా ప్రదీప్ రావత్ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?

టాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 150 సినిమాల్లో నటించిన ప్రదీప్ రావత్ చివరిసారిగా ఈ ఏడాది రిలీజైన తెలుగు సినిమా 'గాయపడ్డ సింహం'లో ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణంతో విలన్ పాత్రలకు ఓ ప్రత్యేక శైలి తీసుకొచ్చిన నటుడిని భారతీయ సినిమా కోల్పోయింది.

సినిమాల్లోకి రాకముందే టెలివిజన్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ప్రదీప్ రావత్.. బి.ఆర్. చోప్రా రూపొందించిన 'మహాభారత్' సీరియల్‌లో అశ్వత్థామ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత హిందీలో 'సర్ఫరోష్', 'లగాన్' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. 'లగాన్'లో ఆయన నటన చూసిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి 'సై' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో భిక్షూ యాదవ్ పాత్రతో ప్రదీప్ రావత్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. అనంతరం 'భద్ర', 'అందరివాడు', 'ఛత్రపతి', 'లక్ష్మీ', 'స్టాలిన్', 'దేశముదురు', 'మాయాజలం' వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్‌లో అత్యంత బిజీ విలన్‌గా మారిపోయారు.

ప్రదీప్ రావత్ విలనిజం అంటే కేకలు వేయడం, రక్తపాతాన్ని సృష్టించడం వంటి సన్నివేశాలకే పరిమితం కాదు. కళ్లలోని తీవ్రత, గంభీరమైన హావభావాలు, డైలాగ్ డెలివరీతోనే భయపెట్టే అరుదైన నటుడు ఆయన. ముఖ్యంగా 'ఛత్రపతి'లో రాస్ బిహారీ పాత్ర, 'సై'లో భిక్షూ యాదవ్ పాత్ర ఇప్పటికీ టాలీవుడ్‌లో అత్యుత్తమ విలన్ పాత్రల్లో ఒకటిగా చెప్పుకుంటారు. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, బెంగాళి, భోజ్‌పురి, నేపాలీ, ఇంగ్లీష్ భాషల్లోనూ ఆయన తన నటనతో గుర్తింపు పొందారు.

ఎన్నో హిట్ సినిమాల్లో నటించినప్పటికీ ప్రదీప్ రావత్ భారీ ఆస్తులు కూడబెట్టలేదని సమాచారం. ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.20 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం చాలామంది విలన్ నటులు ఒక్క సినిమాకే భారీ పారితోషికం తీసుకుంటుండగా.. ప్రదీప్ రావత్ మాత్రం రోజువారీ కాల్షీట్ల ఆధారంగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఒక్కో రోజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పారితోషికం అందుకుంటూ.. తనకు వచ్చిన ప్రతి పాత్రను అంకితభావంతో పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన నటన, ఆయన సృష్టించిన విలన్ పాత్రలు మాత్రం భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు