భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్ ఇక లేరు. 74 ఏళ్ల వయసులో బ్లడ్ క్యాన్సర్‌తో ఆయన కన్నుమూశారు. ఈ వార్తతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తెలుగులో ఆయన పేరుకంటే 'భిక్షూ యాదవ్' అనే పాత్రే ప్రేక్షకుల మదిలో బలంగా నిలిచిపోయింది. 'సై' సినిమాలో ఆయన పండించిన విలనిజంకు నంది అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డులే మొకరిల్లాయంటే ఎంతలా ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
'సై' తర్వాత ప్రదీప్ రావత్‌కు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. 'భద్ర', 'అందరివాడు', 'ఛత్రపతి', 'లక్ష్మీ', 'స్టాలిన్', 'దేశముదురు', 'యోగి', 'మస్కా', 'గజినీ' వంటి ఎన్నో సినిమాల్లో విలన్‌గా మెప్పించాడు. ముఖ్యంగా 'ఛత్రపతి'లో రాస్ బిహారీ పాత్రలో ఆయన చూపించిన నటన ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటారు. విలన్ పాత్రలతో పాటు 'ఓయ్', 'పూలరంగడు', 'నేను శైలజా', 'సరైనోడు' వంటి సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో కూడా ఆకట్టుకున్నాడు.
తెలుగులో దాదాపు 65 సినిమాలు చేసిన ప్రదీప్ రావత్, అన్ని భాషల్లో కలిపి సుమారు 150 చిత్రాల్లో నటించారు. గత కొన్నేళ్లుగా తెలుగులో తక్కువగా కనిపించిన ఆయన, 'వాల్తేరు వీరయ్య' తర్వాత మూడేళ్ల విరామం తీసుకున్నారు. ఈ ఏడాది విడుదలైన 'గాయపడ్డ సింహం' సినిమాలో భిక్షూ దాస్ పాత్రలో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించారు. విశేషమేమిటంటే, తెలుగులో గుర్తింపు తెచ్చిన తొలి పాత్ర పేరు 'భిక్షూ యాదవ్' కాగా, చివరి పాత్ర పేరు కూడా 'భిక్షూ దాస్' కావడం.
వ్యక్తిగత జీవితంలో ప్రదీప్ రావత్ ఎంతో ప్రశాంత స్వభావం కలిగిన వ్యక్తి. ఆయన భార్య కళ్యాణి తెలుగు కుటుంబానికి చెందినవారని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన కళ్యాణి పలు కమర్షియల్ ప్రకటనలు, హిందీ టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించారు. ఈ దంపతులకు విక్రమ్ రావత్, సింగ్ రావత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తెరపై ఎంత క్రూరమైన విలన్‌గా కనిపించినా, ఇంట్లో మాత్రం చాలా నిశ్శబ్దంగా, కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడే వ్యక్తి అని కళ్యాణి గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు అభిమానులను మరింత భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.




















