మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కుడి చేతి మణికట్టుకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తైంది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న గంగా హాస్పిటల్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్య బృందం ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సర్జరీ అనంతరం డాక్టర్లతో కలిసి దిగిన రామ్ చరణ్ తొలి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు.
'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కుడి చేతి మణికట్టుకు గాయమైంది. అప్పటి నుంచి మణికట్టు నొప్పి వేధిస్తుండగా.. ఇటీవల ఆ సమస్య మరింత ఎక్కువ కావడంతో డాక్టర్లు పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించారు. చివరకు శాశ్వత పరిష్కారం కోసం సర్జరీ చేయాలని నిర్ణయించారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి వెన్నుముకకు సంబంధించిన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారు. ఆయనతో పాటు అమెరికాలోని మయామి నుంచి ప్రత్యేకంగా వచ్చిన హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెహాండ్రో బాడియా, ప్రముఖ వైద్యుడు డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ కూడా ఈ సర్జరీలో పాల్గొన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో నిర్వహించిన ఈ శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు.
సర్జరీ అనంతరం రిలీజైన రామ్ చరణ్ ఫోటో అభిమానుల్లో ఊరట నింపింది. ఆసుపత్రిలో వైద్య బృందంతో కలిసి చిరునవ్వుతో కనిపించిన చరణ్‌ను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కనీసం ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్‌లు తెలిపాడు. అంతేకాకుండా ఈ 8 వారాల ఆయనకు ప్రత్యేక ఫిజియోథెరపీ కూడా అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిందో ప్రత్యేకించి చెప్పవనవసరం లేదు.




















