‘బాహుబలి’లో శివగామి పాత్రతో తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి రమ్యకృష్ణ మరోసారి ఓ ఇంటెన్స్ క్యారెక్టర్‌తో అలరించేందుకు సిద్ధమవుతోంది. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘డేవిడ్ రెడ్డి’లో ఆమె కీలక పాత్రను పోషిస్తోంది. బ్రిటిషర్లకు ఎదురొడ్డి పోరాడిన ఓ వీరుడి కథ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్‌తో కూడిన ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో రమ్యకృష్ణ ‘కమలరెడ్డి’ అనే పాత్రలో కనిపించనుంది.
కత్తి పట్టిన రమ్యకృష్ణ..
రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌లో చేతిలో కత్తి పట్టుకుని సింహాసనం లాంటి భారీ కుర్చీలో రమ్యకృష్ణ కూర్చున్న తీరు ఆకట్టుకుంటోంది. ఆమె చుట్టూ శవాలు ఉండటంతో పాటు చేతికి, చీరకు రక్తపు మరకలు కనిపించడం పాత్ర ఎంత క్రూరంగా, శక్తివంతంగా ఉండబోతుందో తెలియజేస్తోంది. ‘కమలరెడ్డి’ పాత్ర రమ్యకృష్ణ కెరీర్‌లో మరో ఐకానిక్ క్యారెక్టర్‌గా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఉక్రెయిన్ భామ హీరోయిన్..
‘డేవిడ్ రెడ్డి’లో ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.




















