బ్రిటిష్‌ అరాచకంపై విజయ్‌ దేవరకొండ తిరుగుబాటు..‘రణబాలి’పై అంచనాలు పెంచేసిన టీజర్‌

విజయ్‌ దేవరకొండ హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’ టీజర్‌ విడుదలైంది. 19వ శతాబ్దపు బ్రిటిష్‌ పాలన, ప్రజల కష్టాలు, ఆహార సంక్షోభం, తిరుగుబాటు నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌ శక్తిమంతమైన యోధుడిగా కనిపించనున్నాడు. టీజర్‌లోని యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్స్‌, విజయ్‌ లుక్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

9 సెప్టెంబర్, 2026 6:04 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బ్రిటిష్‌ అరాచకంపై విజయ్‌ దేవరకొండ తిరుగుబాటు..‘రణబాలి’పై అంచనాలు పెంచేసిన టీజర్‌

Ranabaali Teaser | సెప్టెంబర్ 9 (జనవాణి): విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

19వ శతాబ్దపు నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రిటిష్‌ పాలనలోని దారుణ పరిస్థితులను ప్రధానంగా చూపించినట్లు టీజర్‌ ద్వారా తెలుస్తోంది. 1854-1878 మధ్యకాలంలో జరిగిన చారిత్రక ఘటనల స్ఫూర్తితో కథను రూపొందించినట్లు సమాచారం. మద్రాస్‌ ప్రెసిడెన్సీలో బ్రిటిష్‌ పాలకులు భారతీయుల నుంచి ఆహార ధాన్యాలను దోచుకోవడం, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలను టీజర్‌లో ఆవిష్కరించారు. ఈ అరాచకానికి వ్యతిరేకంగా సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్‌ దేవరకొండ తిరుగుబాటు చేసే యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. బ్రిటిష్‌ పాలకుల ఆధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ.. వారికి ఎదురొడ్డి నిలిచే వీరుడిగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు.

యోధుడిగా విజయ్‌ విశ్వరూపం..

‘రణబాలి’ పాత్ర కోసం విజయ్‌ దేవరకొండ తన లుక్‌, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకున్నట్లు టీజర్‌ స్పష్టం చేస్తోంది. కళ్లలో కోపం, ముఖంలో కసి, శత్రువును ఎదుర్కొనే తెగువతో ఆయన పాత్రను పవర్‌ఫుల్‌గా చూపించారు. భారీ యాక్షన్‌ సన్నివేశాలు, యుద్ధ ఘట్టాలు, రక్తపాతంతో కూడిన విజువల్స్‌ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

“సింగనమల బొబ్బిలిరా నీ అక్క..” అంటూ విజయ్‌ చెప్పే డైలాగ్‌ కూడా ఆకట్టుకుంటోంది. యాక్షన్‌తో పాటు అప్పటి సామాజిక పరిస్థితులు, ప్రజల బాధలు, బ్రిటిష్‌ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి ఎలా తిరుగుబాటు చేశాడనే అంశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.

భారీ స్కేల్‌లో ‘రణబాలి’..

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌ సమర్పిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిర్మాణ విలువలు టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అజయ్‌–అతుల్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ యాక్షన్‌ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ‘కింగ్‌డమ్‌’ తర్వాత విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టీజర్‌ చూస్తుంటే విజయ్‌ మరోసారి తనదైన యాక్షన్‌ అవతార్‌లో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ‘రణబాలి’ అక్టోబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు