సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా మరోసారి సినిమాల్లో బిజీ అవుతున్నారు. రాజకీయాల కారణంగా సుమారు ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల తమిళ చిత్రం ‘అన్భే డయానా’తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో హీరో తల్లిగా కీలక పాత్రలో కనిపించారు. తెలుగులోనూ ఓ సినిమాకు రోజా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను రోజా పంచుకున్నారు. హీరో వెంకటేష్‌తో గతంలో వచ్చిన విభేదాలపైనా ఆమె స్పందించారు.
భర్త సెల్వమణి సినిమా చేస్తానని చెప్పి..
తన భర్త, దర్శకుడు ఆర్‌కే సెల్వమణితో వెంకటేష్ కాంబినేషన్‌లో ఓ తెలుగు సినిమా ఖరారైందని రోజా తెలిపారు. సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయని, షూటింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో వెంకటేష్ మరో తమిళ రీమేక్ కోసం తన డేట్స్ ఇచ్చారని చెప్పారు. దీంతో తన భర్త తీవ్రంగా బాధపడ్డారని రోజా పేర్కొన్నారు. ఆయనకు తెలియకుండా మరో సినిమా కోసం వెంకటేష్ డేట్స్ ఇచ్చారు. దాంతో సెల్వమణి హర్ట్ అయ్యారు. అది చూసి నేను కూడా ఫీలయ్యాను అని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు.
‘పోకిరి రాజా’ షూటింగ్‌లో ఏం జరిగిందంటే?
విభేదాలను పక్కన పెట్టి వెంకటేష్‌తో ‘పోకిరి రాజా’ సినిమాలో నటించినట్లు రోజా తెలిపారు. ఈ సినిమాలోని ఓ పాటకు సంబంధించిన రీల్ పాడవడంతో రీషూట్ కోసం తనను పిలిచారని చెప్పారు. అప్పటికే తన భర్త పుట్టినరోజు వేడుకలు ఉండటంతో కష్టపడి రెండు రోజుల డేట్స్ కేటాయించానని రోజా వెల్లడించారు. అయితే తనపై సాంగ్ షూట్ చేయకుండా రెండు రోజుల పాటు వేచి ఉండేలా చేశారని, పుట్టినరోజు వేడుకలు ఉన్నాయని చెప్పినా తనను పంపించలేదని తెలిపారు. దీంతో కోపంతో బ్యాగ్ సర్దుకుని అక్కడి నుంచి వచ్చేశానని రోజా చెప్పారు. ఈ ఘటనతో వెంకటేష్ కూడా బాధపడ్డారని ఆ తర్వాత తెలిసిందని ఆమె పేర్కొన్నారు. ఆ సినిమా తర్వాత తామిద్దరం కలిసి మరో సినిమా చేయలేదని తెలిపారు.

మధ్యవర్తుల వల్లే విభేదాలు: రోజా
తనకు, వెంకటేష్‌కు మధ్య ఏర్పడిన విభేదాలకు మధ్యవర్తులే కారణమని రోజా అభిప్రాయపడ్డారు. తన గురించి వెంకటేష్‌కు కొందరు లేనిపోని విషయాలు చెప్పి ఉండొచ్చని ఆమె అన్నారు. ప్రస్తుతం రోజా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




















