Ramayana Movie: అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెరపై సీతమ్మగా మెప్పించిన హీరోయిన్లు

రామాయణ సినిమాలో సీత పాత్రలో సాయిపల్లవి కనిపించనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు ఆమె ఎంపికను ప్రశంసిస్తుండగా, మరికొందరు గతంలో సీత పాత్ర పోషించిన నటీమణులతో పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు.

1 ఆగస్టు, 2026 6:20 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Ramayana Movie: అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెరపై సీతమ్మగా మెప్పించిన హీరోయిన్లు

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో రామాయణ ఒకటి. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్, సీత పాత్రలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిపల్లవి పోషిస్తున్న సీత పాత్రపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ తర్వాత సాయిపల్లవి లుక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె సహజమైన నటన, అమాయకమైన రూపం సీత పాత్రకు బాగా సరిపోతుందని ప్రశంసిస్తుండగా, మరికొందరు గతంలో సీత పాత్ర పోషించిన ప్రముఖ నటీమణులతో పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు.

తెలుగు సినీ చరిత్రలో సీత పాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1963లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ ‘లవకుశ’ చిత్రాన్ని ఎవరూ మరచిపోలేరు. ఇందులో అంజలీదేవి సీతాదేవిగా నటించి, ఆ పాత్రకే ప్రాణం పోశారు. ఈ సినిమా విడుదలయ్యాక తెలుగు ప్రజలు అంజలీదేవిని కేవలం ఒక నటిగా చూడలేదు.. నిజమైన సీతాదేవిగానే భావించి పూజించారు. సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు రాముడిగా అలరించారు.ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన 'సంపూర్ణ రామాయణం'లో చంద్రకళ, ఇక 1976లో బాపు తెరకెక్కించిన 'సీతాకల్యాణం'లో జయప్రద సీతగా నటించింది. 2006లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘శ్రీరామదాసు’లో సీతాదేవిగా అర్చన సీతగా మెప్పించారు. ఇక 2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ ఒక పెద్ద మైలురాయి. సీతాదేవిగా నయనతార తమ నటనతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. నయనతారను బాపు సీత పాత్రకు ఎంపిక చేసినప్పుడు మొదట్లో చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ సినిమా విడుదలయ్యాక పరిస్థితి మారిపోయింది. ఇక ఇటీవలి కాలానికి వస్తే 2023లో ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్'లో కృతి సనన్ కూడా జానకిగా నటించారు.

ఇప్పుడు మళ్లీ నితీశ్ తివారీ ‘రామాయణ’ సినిమాతో సాయి పల్లవి రూపంలో సీతాదేవి పాత్ర వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో సాయిపల్లవిని గత నటీమణులతో పోల్చడం, ఆ పాత్రకు ఆమె సరైన న్యాయం చేయలేదంటూ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అయితే సినిమా విడుదలకు ముందే కేవలం ప్రచార వీడియోల ఆధారంగా ఒక నటి ప్రతిభను అంచనా వేయడం సరికాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సహజ నటనకు పేరుగాంచిన సాయిపల్లవి సీత పాత్రలో ఎంత ప్రభావం చూపిస్తారో సినిమా విడుదలైన తర్వాతే పూర్తి స్థాయిలో అంచనా వేయవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు