ఆగస్టు 15న తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్‌కు నటి త్రిష సెల్యూట్ చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ అంశంపై విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో నటి సంజన గల్రానీ స్పందించారు. విజయ్ రాజకీయంగా ఎదుగుతున్న తీరును కొందరు జీర్ణించుకోలేక ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారని సంజన అన్నారు.
రాజకీయ పనితీరుపై విమర్శలు చేయడానికి అంశాలు దొరకనప్పుడు వ్యక్తిగత విషయాలను తెరపైకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలను కేంద్రంగా చేసుకుని రాజకీయ విమర్శలు చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి రాజకీయ పనితీరుపై మాట్లాడకుండా వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకుని విమర్శలు చేయడం తగదన్నారు. అదే సమయంలో నటి త్రిషపై సంజన ప్రశంసలు కురిపించారు. త్రిష ప్రతిభావంతమైన నటి అని, సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్నారని అన్నారు.విజయ్, త్రిషల మధ్య ఉన్న అనుబంధం పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని సంజన స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వారి సాన్నిహిత్యాన్ని చూసి సంబంధంపై నిర్ణయానికి రావడం సరికాదన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంజన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.




















