‘తెల్ల కాగితం’ సినిమా రివ్యూ: యూత్‌ను టార్గెట్ చేసిన ఈ ప్రేమకథ ఎలా ఉంది?

హర్ష్‌ రోషన్‌, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్ల కాగితం’ అక్టోబర్‌ 1 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. యుక్త వయసులో ప్రేమలో పడిన ఓ జంట తొందరపాటులో చేసిన తప్పు ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అన్నది చూద్దాం.

2 అక్టోబర్, 2026 4:43 PM•ByNarender Kumar Nangunoori

Share this article

‘తెల్ల కాగితం’ సినిమా రివ్యూ: యూత్‌ను టార్గెట్ చేసిన ఈ ప్రేమకథ ఎలా ఉంది?

Thella Kagithm Film Review | రాము (హర్ష్‌ రోషన్‌) తల్లిదండ్రులను కోల్పోయిన మిడిల్‌క్లాస్‌ కుర్రాడు. అన్నావదినల వద్ద ఉంటూ చదువుకుంటుంటాడు. మరోవైపు ఆశ (నక్షత్ర) సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి మూర్తి (అజయ్‌) క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. రాము, ఆశ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. యుక్త వయసుకు వచ్చేసరికి ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే వయసులోని తొందరపాటు, ప్రేమను కోల్పోతామనే భయం వారిని ఓ తప్పటడుగు వేయిస్తుంది. దాని తర్వాత ఈ యువ జంట ఎదుర్కొన్న సమస్యలేంటి? కుటుంబ సభ్యులకు విషయం తెలియకుండా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరకు ఏం తెలుసుకున్నారు? అన్నదే ‘తెల్ల కాగితం’ కథ.

ఎలా ఉందంటే..

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ యుక్త వయసులోని ఆకర్షణ, ప్రేమ, తొందరపాటు నిర్ణయాల చుట్టూ తిరుగుతుంది. రాము, ఆశల స్కూల్‌ డేస్‌తో మొదలయ్యే కథ తొలుత సరదాగా సాగుతుంది. వారి మధ్య స్నేహం ప్రేమగా మారే క్రమాన్ని దర్శకుడు ఆసక్తికరంగానే చూపించారు. ప్రేమను కోల్పోతామనే భయంతో హీరో చేసే తప్పటడుగు తర్వాత కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో ఫన్‌, ఎమోషన్‌ కలగలిసిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే సెకండాఫ్‌లో సమస్య నుంచి బయటపడేందుకు హీరో, హీరోయిన్‌ చేసే ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. కథలో తర్వాత ఏం జరుగుతుందో ముందుగానే ఊహించే అవకాశం ఉండటం కొంత నిరాశ కలిగిస్తుంది.

క్లైమాక్స్‌లో హీరో సోదరుడు, హీరోయిన్‌ తండ్రి మధ్య జరిగే సంభాషణలు మాత్రం ఆలోచింపజేస్తాయి. యువత తొందరపాటు నిర్ణయాలు, చెడు స్నేహాలు, వాటి వల్ల జీవితంలో ఎదురయ్యే పరిణామాలపై సినిమా ఓ సందేశాన్ని అందించే ప్రయత్నం చేసింది. అయితే ఇలాంటి కథాంశాలతో ఇప్పటికే పలు సినిమాలు రావడంతో ‘తెల్ల కాగితం’లో కొత్తదనం పెద్దగా కనిపించదు.

నటీనటుల పనితీరు

హర్ష్‌ రోషన్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. తన వయసుకు తగ్గ పాత్రలో సహజంగా కనిపించాడు. అయితే కథ, పాత్రలో కొత్తదనం లేకపోవడం అతని నటనకు పెద్దగా ఉపయోగపడలేదు. నక్షత్రకు ఇది మంచి అవకాశం. ఆశ పాత్రలో ఆమె మెప్పించింది. అందంతో పాటు హావభావాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన పరిణతి కనిపిస్తుంది. హీరోయిన్‌ తండ్రిగా అజయ్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. హర్ష్‌ స్నేహితుడిగా దీపక్‌ కామెడీతో నవ్వించాడు. కసిరెడ్డి రాజ్‌కుమార్‌ పాత్ర మాత్రం సాధారణంగానే అనిపిస్తుంది.

సాంకేతికంగా..

విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం సినిమాకు ప్రధాన బలాల్లో ఒకటి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కథకు తగ్గట్టుగా సాగింది. గ్రామీణ నేపథ్యాన్ని కె.వి. గుహన్‌ కెమెరా పనితనం చక్కగా ఆవిష్కరించింది.

చివరగా..

‘తెల్ల కాగితం’లో మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ, కథలో కొత్తదనం లేకపోవడం ప్రధాన లోపం. ఫస్టాఫ్‌ సరదాగా సాగినా సెకండాఫ్‌ రొటీన్‌ ట్రీట్‌మెంట్‌తో నెమ్మదిస్తుంది. నటీనటుల పనితీరు, సంగీతం, కెమెరా వర్క్‌ సినిమాకు ప్లస్‌ కాగా ఊహించగలిగే కథనం, సెకండాఫ్‌ ల్యాగ్‌ మైనస్‌గా నిలిచాయి. యువతకు ఓ సందేశాన్ని అందించే ప్రయత్నం చేసినా, ‘తెల్ల కాగితం’ తన కథలోని కొత్తదనాన్ని పూర్తిగా చాటుకోలేకపోయింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు