కర్నూలు,సెప్టెంబర్ 17 (జనవాణి): ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్ సతీమణి, అపోలో వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల గురువారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు.
ప్రత్యేక హెలికాప్టర్‌లో మంత్రాలయానికి చేరుకున్న ఉపాసనకు ఆలయ అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని దర్శించుకున్న ఉపాసన పూజా, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి ఆమెను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని ఉపాసన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రామ్‌చరణ్ సతీమణి మంత్రాలయానికి వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు, భక్తులు ఆమెను చూసేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.




















