విక్టరీ వెంకటేశ్ వరుస విజయాలతో జోరు మీదున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వెంకీ.. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత వెంకటేశ్, త్రివిక్రమ్ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో వెంకటేశ్ చిట్టిబాబు అనే మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీనిధి శెట్టి స్వర్ణగా నటిస్తుండగా.. యువిన పార్థవి, రాజా ప్రజ్వల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
టీజర్‌తో పెరిగిన అంచనాలు
సెప్టెంబర్ 12న విడుదలైన ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంశాలతో పాటు కామెడీ, ఎమోషన్, యాక్షన్‌కు కూడా సినిమాలో చోటు ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. భార్య చేసే అప్పులతో ఇబ్బందులు పడే చిట్టిబాబుకు అనుకోకుండా లాటరీలో అదృష్టం కలిసొస్తుంది. అయితే డబ్బు రావడంతో సమస్యలు తీరిపోకుండా.. కొత్త కష్టాలు అతని జీవితంలోకి వస్తాయి. “నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని నాకు బాగా తెలుసు.. కానీ సిట్యువేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి వెనకాడను” అంటూ వెంకటేశ్ చెప్పిన డైలాగ్ టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనిధి శెట్టి తన గ్లామర్‌తో ఆకట్టుకోగా.. యువిన పార్థవి కూడా టీజర్‌లో ప్రత్యేకంగా కనిపించింది.
వెంకీ సినిమాకు తారక్ వాయిస్?
ఇదిలా ఉంటే ‘ఆదర్శ కుటుంబం’కు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ వార్త నిజమేనా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
రిలీజ్ డేట్‌పై కొత్త ప్రచారం
‘ఆదర్శ కుటుంబం’ సినిమాను అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు టీజర్‌లో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ తేదీ మారే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సినిమా అక్టోబర్ 2 నుంచి వాయిదా పడి అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాక్.
వెంకటేశ్, త్రివిక్రమ్ కలిసి నేరుగా సినిమా చేయడం ఇదే తొలిసారి అయినప్పటికీ.. వీరి అనుబంధం చాలా పాతది. వెంకటేశ్ కెరీర్‌లో క్లాసిక్స్‌గా నిలిచిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. అలాగే ‘వాసు’ సినిమాకు డైలాగ్స్ రాశారు. దీంతో ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’పై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.




















