ఇండస్ట్రీలో అందరి జీవితాలు పూలపాన్పులు కావు.. కొందరివి ముళ్ల కిరీటాలు కూడా. ఎంతో పేరు, ప్రతిష్ట సంపాదించిన తర్వాత కూడా కొందరి జీవితాలు ఊహించని విషాదంతో ముగిసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి నటుల్లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన రంగనాథ్ ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, టెలివిజన్ నటుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆయన చివరి జీవితం మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 70వ దశకం నుంచి తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన రంగనాథ్ 'మన్మథుడు', 'నిజం', 'అడవి రాముడు', 'దేవరాయ', 'గోపాల గోపాల' వంటి ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. 'శాంతి నివాసం', 'మొగలిరేకులు' వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు కూడా మరింత చేరువయ్యారు.
రంగనాథ్ అసలు పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్. సినిమాల్లోకి రాకముందు భారతీయ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం చేశారు. అయితే చిన్నప్పటి నుంచే నటనపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ రంగంలో అడుగుపెట్టారు. 1974లో విడుదలైన 'చందన' సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన, అనంతరం 40కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు. తర్వాత కాలంలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు.
వ్యక్తిగత జీవితంలో మాత్రం రంగనాథ్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆయన భార్య చైతన్య ప్రమాదవశాత్తూ మంచాన పడిపోవడంతో దాదాపు 15 సంవత్సరాల పాటు ఎంతో ప్రేమగా సేవ చేశారు. 2009లో ఆమె మరణించడంతో ఆయన తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతుంటారు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని, నెలకు రూ.5 వేల అద్దె ఇంట్లో నివసించాల్సి వచ్చిందని సమాచారం. 2015లో హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడం తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మరణానికి ముందు గోడపై తన చేతిరాతతో 'మీనాక్షిని ఇబ్బంది పెట్టొద్దు' అని రాసి వెళ్లిన విషయం అప్పట్లో సంచలనంగా మారింది. తర్వాత ఆయన కుమారుడు నాగేంద్ర కుమార్ స్పందిస్తూ.. మీనాక్షి అనే పనిమనిషి తమ తల్లిదండ్రులను ఎన్నో సంవత్సరాలు అంకితభావంతో చూసుకుందని, అందుకే ఆమెకు తండ్రి కొంత ఆస్తి, బ్యాంక్ డబ్బులు కూడా ఇచ్చారని వెల్లడించారు. తమ తల్లిదండ్రులకు ఆమె చేసిన సేవకు కృతజ్ఞతగా తామూ ఆర్థికంగా సహాయం చేశామని చెప్పారు. అలాగే కుటుంబంపై ఆధారాలు లేకుండా వచ్చిన కొన్ని మీడియా కథనాలు తమను తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో విజయాలు సాధించిన ఒక గొప్ప నటుడు చివరికి ఒంటరితనం, వ్యక్తిగత బాధలు, ఆర్థిక ఇబ్బందులతో జీవితం ముగించుకోవడం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కలచివేస్తూనే ఉంది.




















