నల్ల కాగితాలను కెమికల్‌లో ముంచితే రూ.500 నోట్లు! ఇద్దరు యువతుల ఘరానా మోసం

నల్ల కాగితాన్ని ప్రత్యేకమైన కెమికల్‌లో ముంచితే అసలైన రూ.500 నోటుగా మారుతుందని నమ్మించిన ఓ ముఠా రాయ్‌పూర్‌కు చెందిన వ్యాపారిని ఏకంగా రూ.1.5 కోట్లకు మోసం చేసింది.

29 సెప్టెంబర్, 2026 8:10 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నల్ల కాగితాలను కెమికల్‌లో ముంచితే రూ.500 నోట్లు! ఇద్దరు యువతుల ఘరానా మోసం

చూడటానికి అమాయకంగా కనిపించే ముఖాలు కానీ వెనుక భారీ మోసం. రసాయన ద్రావణంలో నల్ల కాగితాన్ని ముంచితే కాసేపట్లోనే అసలైన రూ.500 నోటుగా మారుతుందని చెప్పి ఓ అంతర్రాష్ట్ర ముఠా భారీగా మోసానికి పాల్పడింది. రాయ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారిని టార్గెట్ చేసిన నిందితులు తమ వద్ద విదేశాల నుంచి తెచ్చిన అరుదైన కెమికల్ ఉందని నమ్మించారు. దాని సాయంతో నల్ల కాగితాలను అసలైన కరెన్సీగా మార్చవచ్చని చెప్పారు. నమ్మకం కలిగించేందుకు బాధితుడి కళ్ల ముందే డెమో కూడా ఇచ్చారు.

కళ్లెదుటే ‘కరెన్సీ’ ప్రత్యక్షం

ఓ నల్లటి కాగితాన్ని రసాయన ద్రావణంలో ముంచగానే దానిపై ఉన్న నలుపు రంగు తొలగిపోయి రూ.500 నోటు కనిపించేలా చేశారు. ఈ మాయాజాలాన్ని నిజమని నమ్మిన వ్యాపారి రూ.20 కోట్ల విలువైన కరెన్సీ తయారు చేయాలని ఆశపడ్డాడు. ఇందుకు అవసరమైన కెమికల్‌ను విదేశాల నుంచి తెప్పించాలంటూ నిందితులు రూ.1.5 కోట్లు డిమాండ్ చేశారు. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందన్న ఆశతో వ్యాపారి ఆ నగదును వారికి అప్పగించాడు. ఆ తర్వాత నిందితులు కెమికల్, పేపర్లు ఉన్నాయంటూ ఓ పెట్టెను అతనికి ఇచ్చారు. నెల రోజుల తర్వాత పెట్టె తెరిస్తే మొత్తం డబ్బుగా మారుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పెట్టె తెరిచిన తర్వాత అసలు మోసం వెలుగులోకి

నెల రోజుల తర్వాత బాధితుడు పెట్టెను తెరిచి చూడగా అందులో కరెన్సీకి బదులుగా పనికిరాని నల్ల కాగితాలు మాత్రమే కనిపించాయి. తాను మోసపోయినట్లు గుర్తించిన వ్యాపారి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న రాయ్‌పూర్ స్పెషల్ పోలీస్ టీమ్ సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి లభించిన సమాచారంతో పూణే సమీపంలోని ఖండాలా రిసార్ట్‌పై దాడి చేశారు. దాడిలో ముఠాలోని మరికొందరు సభ్యులను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.4 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

అసలు ‘కెమికల్ వాష్’ మోసం ఎలా చేస్తారు?

ఇలాంటి మోసాలను అంతర్జాతీయంగా ‘బ్లాక్ డాలర్ స్కామ్’, ‘వాష్ వాష్ స్కామ్’ వంటి పేర్లతో పిలుస్తారు. ఇందులో ఎలాంటి అద్భుతమైన కెమికల్ ఉండదు. బాధితుడిని నమ్మించేందుకు ముందుగానే సిద్ధం చేసిన నోటును ఉపయోగిస్తారు. అసలైన నోటుపై తొలగిపోయే పదార్థాన్ని పూసి నల్లగా మార్చి, బాధితుడి ముందు ప్రత్యేక ద్రావణంతో కడిగినట్లు చూపిస్తారు. పై పొర తొలగిపోవడంతో లోపల ఉన్న అసలైన నోటు బయటపడుతుంది. దీంతో నల్ల కాగితం నిజంగానే కరెన్సీగా మారిందని బాధితుడు భావించేలా చేస్తారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో కరెన్సీ తయారు చేసి ఇస్తామంటూ ‘కెమికల్ కొనుగోలు’, ‘ప్రాసెసింగ్ ఖర్చు’ తదితర పేర్లతో అసలైన డబ్బును తీసుకుంటారు. చివరకు నల్ల కాగితాలు లేదా పనికిరాని వస్తువులతో కూడిన పెట్టెను ఇచ్చి పరారవుతారు.

జాగ్రత్త.. ఇలాంటి మోసాలకు బలికావద్దు

సాధారణ కాగితాలను ఏదైనా రసాయనంతో అసలైన రిజర్వ్ బ్యాంక్ కరెన్సీగా మార్చడం సాధ్యం కాదు. తక్కువ సమయంలో భారీగా డబ్బు సంపాదించవచ్చని, రహస్యమైన కెమికల్‌తో నోట్లను తయారు చేయవచ్చని చెప్పే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు