హైదరాబాద్, అక్టోబర్ 3 (జనవాణి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్మీ ఆయుధాలను చోరీ చేసి, వాటితో భారీ దోపిడీలు చేయాలని నిందితులు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు మల్కాజ్‌గిరి పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు సర్వీసులో ఉన్న ఆర్మీ జవాన్లతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత తానే ఒంటరిగా ఈ నేరానికి పాల్పడ్డానని చెప్పిన రిటైర్డ్ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్‌ను విచారించడంతో అసలు నెట్‌వర్క్ బయటపడింది.
ఆర్మీ జవాన్ల సహకారంతో ఆయుధాల చోరీ
అరెస్టైన ఆర్మీ సిబ్బందిలో ఏపీకి చెందిన సిపాయి కొండూరి శేషులు, నాయక్ వినోద్ కుమార్, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన హవల్దార్ కూచరకంటి ప్రవీణ్ ఉన్నారు. వీరితో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవి దే అలియాస్ ఓబీ, బారక్‌పూర్ కంటోన్మెంట్ వద్ద చెరకు రసం వ్యాపారం చేసే బీర్బల్ షా, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన తాపీ మేస్త్రీ ఉప్పుతోళ్ల మల్లికార్జున్, కిరాణా వ్యాపారి చెమ్మకార్ నిరంజన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్యాంకులు, జ్యువెలరీ షాపులే టార్గెట్
పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మల్లేష్ తన బంధువు మల్లికార్జున్, మిత్రుడు నిరంజన్‌తో కలిసి భారీ దోపిడీలకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఆయుధాలు అవసరం కావడంతో పశ్చిమ బెంగాల్‌లోని పాత పరిచయస్తులను సంప్రదించాడు. అక్కడ ఆలస్యం కావడంతో తాను గతంలో పనిచేసిన మద్రాస్ రెజిమెంట్‌లోని శేషులు, వినోద్ కుమార్, ప్రవీణ్‌ల సహకారం తీసుకున్నాడు. వారి సహాయంతో బొల్లారం క్యాంప్‌లోని కోట్, మ్యాగజైన్ తాళాలు పగలగొట్టి ఆయుధాలు, బుల్లెట్లను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన ఆర్మీ పిస్టళ్లను ఒక్కొక్కటి రూ.3 లక్షలకు, లాంగ్ వెపన్లను రూ.5 లక్షలకు విక్రయించేలా అవి దేతో ఒప్పందం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
ఆగస్టు 31న ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాలు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం సెప్టెంబర్ 11న మల్లేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో:
4 ఏకే-203 రైఫిళ్లు, 5 మ్యాగజైన్లు
1 INSAS రైఫిల్, 3 మ్యాగజైన్లు
6 అత్యాధునిక 9mm పిస్టళ్లు, 12 మ్యాగజైన్లు
1 సివిలియన్ పిస్టల్
3 బైనాక్యులర్లు
1,912 లైవ్ రౌండ్ల మందుగుండు సామగ్రి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలోనూ చోరీ కేసులు
ప్రధాన నిందితుడు మల్లేష్‌పై గతంలో అచ్చంపేట, అమ్రాబాద్ పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆయుధాల చోరీ వెనుక ప్రధాన ఉద్దేశం భారీ ఆస్తి నేరాలు, దోపిడీలకు పాల్పడటమేనని, ఇందులో ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి స్పష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.




















