హైదరాబాద్, సెప్టెంబర్ 22 (జనవాణి): బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో నిందితుడు మల్లేష్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చోరీకి నాలుగు నెలల ముందే అతడు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు బొల్లారం పోలీసులు గుర్తించారు.
ఆదివారమే ఎందుకు ఎంచుకున్నాడు?
ఆదివారం సెలవు దినం కావడంతో ఆర్మీ అధికారులు, గార్డ్ ఇన్‌చార్జ్‌ల కదలికలు తక్కువగా ఉంటాయని మల్లేష్ భావించినట్లు పోలీసులు తెలిపారు. అందుకే ఆయుధాలను చోరీ చేసేందుకు ఆదివారాన్ని ముందుగానే ఎంచుకున్నట్లు వెల్లడించారు.
ఆయుధాలను విక్రయించేందుకు ప్లాన్
చోరీ చేసిన ఆయుధాలను సంఘ విద్రోహ శక్తులకు విక్రయించాలని మల్లేష్ భావించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో ఆయుధాలు కొనుగోలు చేసే వ్యక్తుల కోసం అతడు వెతికినట్లు దర్యాప్తులో గుర్తించారు. వాటి ద్వారా వచ్చే డబ్బుతో తన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఆర్మీ అధికారులపై కక్ష?
మల్లేష్ దాదాపు 16 ఏళ్ల పాటు మద్రాస్ రెజిమెంట్‌లో విధులు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మరో మూడేళ్ల సర్వీస్ మిగిలి ఉన్న సమయంలో విధుల నుంచి తొలగించడంతో ఆర్మీ అధికారులపై అతడికి కక్ష పెరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయుధాలను చోరీ చేసి అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీయాలని పథకం వేసినట్లు దర్యాప్తులో గుర్తించామని పోలీసులు చెప్పారు.

సీసీటీవీలపై ముందే ఆరా
మల్లేష్‌కు ఆర్మీలోని కొందరు మాజీ సహచరులతో తరచూ ఫోన్ సంభాషణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్‌చార్జ్ నాయక్ వినోద్, మ్యాగజైన్ ఇన్‌చార్జ్ బల్లి మధు, గార్డ్ ఇన్‌చార్జ్ హవాల్దార్ కేవీ రమణ, క్వార్టర్ గార్డ్ ఇన్‌చార్జ్ నిరేష్‌తో అతడు మాట్లాడినట్లు తెలిపారు. మద్రాస్ రెజిమెంట్‌లో సీసీటీవీ కెమెరాలను ఎప్పుడు ఆఫ్ చేస్తారు? అనే విషయంపై కూడా మల్లేష్ తన ఆర్మీ స్నేహితులను ఆరా తీసినట్లు పోలీసులు వెల్లడించారు. 16 ఏళ్ల సర్వీస్ అనుభవాన్ని ఉపయోగించుకుని ఆయుధాల చోరీకి పక్కా ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.




















