ఢిల్లీ,సెప్టెంబర్ 16 (జనవాణి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు.
గంటన్నరపాటు లూత్రా వాదనలు
విచారణ సందర్భంగా సిద్ధార్థ లూత్రా సుమారు గంటన్నరపాటు పలు అంశాలను ధర్మాసనం ముందు ప్రస్తావించారు. 1988 నాటి అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచం ఇవ్వడం నేరంగా పరిగణించలేదని ఆయన వాదించారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ నేరంగా పరిగణించే నిబంధనలు 2018లో చేసిన సవరణతో వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో 2015లో జరిగిన ‘ఓటుకు నోటు’ వ్యవహారానికి 2018 నాటి సవరణ చట్టాన్ని వర్తింపజేయడం సాధ్యం కాదని లూత్రా వాదించారు. అలాగే ఎఫ్‌ఐఆర్, జనరల్ డైరీ ఎంట్రీ నమోదు చేయకుండానే ట్రాప్ నిర్వహించారని పేర్కొన్నారు.
ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
లూత్రా వాదనలపై స్పందించిన ధర్మాసనంలోని జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి ఓటు వేయడం పౌరులకు లభించిన చట్టబద్ధమైన హక్కు అని పేర్కొన్నారు. ఆ ఓటు ప్రక్రియను ఎవరైనా ప్రభావితం చేస్తే అవినీతి నిరోధక చట్టం వర్తించే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. తదుపరి విచారణలో ఈ అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




















