చెన్నై, ఆగస్టు 23 (జనవాణి): చెన్నైలో ఓ మహిళ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్టు 5న చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఆగ్రా చేరుకున్న సమయంలో జనరల్ కంపార్ట్‌మెంట్ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎరుపు రంగు సూట్‌కేస్‌లో మానవ శరీర భాగాలను గుర్తించారు. సూట్‌కేస్ చెన్నై నుంచి వచ్చినట్లు నిర్ధారించిన యూపీ పోలీసులు తమిళనాడు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చెన్నై పోలీసులు రంగంలోకి దిగి రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని 350కుపైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ ఆధారంగా ఓ పురుషుడు, మహిళ ఎరుపు రంగు సూట్‌కేస్‌తో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లోకి వచ్చి దాన్ని బోగీలో ఉంచి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారిద్దరూ లోకల్ ట్రైన్‌లో గూడువాంజేరికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు గూడువాంజేరిలోని ఓ ఇంటిని గుర్తించారు. అక్కడ ఒడిశాకు చెందిన మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్‌తో పాటు హయాత్ నిషా అనే మహిళ నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో రైలులో లభించిన శరీర భాగాలు నిషావేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు అక్కడ కనిపించిన దృశ్యాలతో షాక్‌కు గురయ్యారు. ఓ బిర్యానీ పాత్రలో అన్నంతో పాటు మానవ శరీరం ముక్కలు కనిపించగా.. ఇంట్లో పలుచోట్ల రక్తపు మరకలను గుర్తించారు. బిర్యానీ పాత్రను స్వాధీనం చేసుకుని చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హత్యకు గురైన మహిళ తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిషా హత్యకు గురైన కారణమేంటి? ఈ ఘటనలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.




















