ఢిల్లీ,సెప్టెంబర్ 21 (జనవాణి): దేశ రాజధాని ఢిల్లీలో 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆరో తరగతి చదువుతున్న బాలిక సదర్ బజార్ ప్రాంతంలో గ్రాసరీస్ కోసం వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 16న రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
మాయమాటలు చెప్పి దుకాణంలోకి..
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 16న రాత్రి 11 గంటల సమయంలో బాలిక పెన్సిల్, పెన్ను వంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లింది. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న ఓ టైలర్ షాప్ యజమాని బాలికకు మాయమాటలు చెప్పి తన దుకాణంలోకి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాలిక చేతులు, కాళ్లు కట్టేసి బంధించి లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలికను రక్షించారు.
56 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని 56 ఏళ్ల మసూద్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అతడిపై సంబంధిత చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికకు అవసరమైన వైద్య, ఇతర సహాయ చర్యలు అందించినట్లు అధికారులు వెల్లడించారు.




















