హైదరాబాద్, సెప్టెంబర్ 12 (జనవాణి): ప్రముఖ టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని, డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. సెప్టెంబర్ 9న ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రాజును అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
పరిచయం కాస్తా ప్రేమగా..
పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మియాపూర్‌లో ఆమె బొటిక్ నిర్వహిస్తోంది. అదే భవనంలోని మూడో అంతస్తులో ‘ఢీ’ ఫేమ్ చిట్టి మాస్టర్ డ్యాన్స్ స్టూడియో ఏర్పాటు చేశారు. డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం ‘ఢీ-20’ విన్నర్ రాజు తరచూ అక్కడికి వచ్చేవాడు. ఈ క్రమంలో యువతితో అతడికి పరిచయం ఏర్పడి, ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. కొంతకాలానికి పరిచయం ప్రేమగా మారిందని, తనను పెళ్లి చేసుకుంటానని రాజు నమ్మించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
పెళ్లి పేరుతో శారీరక సంబంధం.. రూ.12 లక్షలు?
మే 2026లో ఆరోగ్యం బాగోలేదని చెప్పి రాత్రి సమయంలో తన బొటిక్‌కు రాజు వచ్చాడని యువతి తెలిపింది. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పి తనతో శారీరకంగా కలిశాడని ఆరోపించింది. ఆ తర్వాత వివిధ అవసరాల పేరుతో ఫోన్‌పే, నగదు రూపంలో తన నుంచి సుమారు రూ.12 లక్షలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి విషయం ప్రస్తావించిన ప్రతిసారీ తన చెల్లి పెళ్లి పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుందామని రాజు చెబుతూ వచ్చాడని తెలిపింది. తన ఇంట్లో, కార్యాలయంలో పలుమార్లు శారీరకంగా కలిసిన అనంతరం.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ చివరకు పెళ్లికి నిరాకరించాడని ఆరోపించింది.
పోలీసులకు ఫిర్యాదు.. రాజుకు రిమాండ్
తన నుంచి తీసుకున్న డబ్బుతో రాజు ఇతర అమ్మాయిలతో తిరుగుతున్నాడని, తనలాగే మరికొందరిని కూడా మోసం చేసినట్లు తెలిసిందని బాధితురాలు పేర్కొంది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. సెప్టెంబర్ 9న సాయంత్రం 4 గంటలకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు క్రైమ్ నంబర్ 1307/2026 కింద BNS సెక్షన్లు 69, 318(4) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది.
Loading Tweet...




















