డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీలపై ఏసీబీ పంజా..బినామీల ఇళ్లలో భారీగా ఆధారాలు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఆయన బినామీలు, ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై హైదరాబాద్‌, జహీరాబాద్‌లో ఏకకాలంలో 10 బృందాలతో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, మద్యం సీసాలతో పాటు కీలక పత్రాలు, డిజిటల్‌ ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

25 సెప్టెంబర్, 2026 10:02 AM•ByNarender Kumar Nangunoori

Share this article

డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీలపై ఏసీబీ పంజా..బినామీల ఇళ్లలో భారీగా ఆధారాలు

హైదరాబాద్,సెప్టెంబర్ 25 (జనవాణి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. గురువారం హైదరాబాద్‌, జహీరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 10 ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. భీమ్‌రెడ్డి ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే వ్యక్తులు, ఆయనకు సన్నిహితంగా ఉన్న బినామీల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో సుమారు రూ.400 కోట్ల ఆస్తులకు సంబంధించిన మనీట్రయల్‌పై కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

బిల్డర్‌ ఇంట్లో రూ.1.35 కోట్ల నగదు

పుప్పాలగూడలో భీమ్‌రెడ్డి తరఫున నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్డర్‌ వీరబొమ్మ వెంకటేష్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, 14 విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతంలో టోలిచౌకిలో షట్టర్‌ తీసుకుని హోల్‌సేల్‌ బియ్యం వ్యాపారం చేసిన వెంకటేష్‌ భీమ్‌రెడ్డితో పరిచయం తర్వాత భారీగా ఆస్తులు కూడబెట్టిన క్రమంపై ఏసీబీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మాజీ హోంగార్డు ఇంట్లో కీలక పత్రాలు

జహీరాబాద్‌లో భీమ్‌రెడ్డి ఆస్తులు, ఫాంహౌస్‌ వ్యవహారాలను చూసుకునే మాజీ హోంగార్డు లక్ష్మణ్‌ నాయక్‌ ఇల్లు, కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిర్వహించిన తనిఖీల్లో లక్ష్మణ్‌ నాయక్‌, అతని బంధువుల పేర్లపై భీమ్‌రెడ్డి 47.5 ఎకరాలు రిజిస్టర్‌ చేయించినట్లు గుర్తించిన ఏసీబీ ఆ డాక్యుమెంట్లు తన ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

పటాన్‌చెరులో భీమ్‌రెడ్డి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన సమయంలో లక్ష్మణ్‌ నాయక్‌ ఆయన వద్ద హోంగార్డుగా పనిచేశాడు. ఆ తర్వాత భీమ్‌రెడ్డికి నమ్మకస్తుడిగా మారి బినామీగా వ్యవహరించినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. భీమ్‌రెడ్డి బదిలీ అయిన తర్వాత హోంగార్డు ఉద్యోగాన్ని వదిలేసిన లక్ష్మణ్‌ నాయక్‌ బంగారు నగల వ్యాపారం ప్రారంభించి భారీగా ఆస్తులు కూడబెట్టిన తీరుపైనా అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఆడిటర్‌ కార్యాలయంలో డిజిటల్‌ ఆధారాలు

భీమ్‌రెడ్డి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే ఆడిటర్‌కు చెందిన జూబ్లీహిల్స్‌ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు చేసింది. ఈ సందర్భంగా కీలక డిజిటల్‌ సాక్ష్యాలు లభించినట్లు సమాచారం. భీమ్‌రెడ్డి, ఆయన బినామీల నుంచి ఆడిటర్‌కు వచ్చిన ఈమెయిల్స్‌, ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన నగదు లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

రూ.6 కోట్ల లావాదేవీపై ఆరా

ఇబ్రహీంబాగ్‌లోని వెసెల్లా మెడోస్‌ ఆస్తి కొనుగోలుకు రూ.6 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవరావు ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. అయితే అధికారులు ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న మాధవరావు మార్నింగ్‌ వాక్‌ పేరుతో బయటకు వెళ్లి తిరిగి రాలేదని తెలుస్తోంది. దీంతో ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించినట్లు సమాచారం.

గచ్చిబౌలి టెలికం నగర్‌లో భీమ్‌రెడ్డి ఆస్తుల కేర్‌టేకర్‌గా ఉన్న ప్రసాద్‌రావును కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. గతంలో అదే ప్రాంతంలో వాచ్‌మెన్‌గా పనిచేసిన ప్రసాద్‌రావు.. భీమ్‌రెడ్డి పరిచయంతో ఆస్తుల వ్యవహారాల్లో కీలకంగా మారినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఫోన్లు ధ్వంసం చేసినట్లు గుర్తింపు

భీమ్‌రెడ్డి అరెస్టు తర్వాత ఆయనతో సంబంధం ఉన్న పలువురు బినామీలు తమ మొబైల్‌ ఫోన్లను పగులగొట్టి పారేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా అధికారులు దృష్టి సారించారు. గురువారం ముగ్గురు బినామీల విచారణ పూర్తయినట్లు సమాచారం. ఇంకా పలువురు వ్యక్తులు ఏసీబీ నిఘాలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, భీమ్‌రెడ్డితో ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు