సిద్దిపేట జిల్లాలో లంచం తీసుకుంటున్నారన్న ఆరోపణలపై గ్రామ కార్యదర్శి, కారొబార్ ఏసీబీ అధికారుల ట్రాప్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో ఇంటి మ్యుటేషన్ కోసం రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదంటూ మూసివేసిన ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడి నిర్వహించారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్‌వోతో పాటు హెల్త్ ఇన్‌స్పెక్టర్, డ్రైవర్ పాత్రపై దర్యాప్తు చేపట్టారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు చేయాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఆయన బినామీలు, ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై హైదరాబాద్, జహీరాబాద్‌లో ఏకకాలంలో 10 బృందాలతో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, మద్యం సీసాలతో పాటు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ ఎన్. లక్ష్మీభాస్కర్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో రూ.6.13 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.
ములుగు జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. గోవిందరావుపేట మండల తహసీల్దార్ సృజన్‌కుమార్ భూమిని కుటుంబసభ్యుల పేర్లపై మార్చేందుకు రూ.14 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది. విదేశీ కంపెనీకి సమన్లు అందకపోవడంతో విచారణ వాయిదా పడిందని కేటీఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు కేసులకు భయపడేది లేదని, న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు చేపట్టిన ట్రాప్ కలకలం రేపింది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన వ్యవహారంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా సెక్షన్ ఆఫీసర్ వినోద్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం ఇద్దరినీ నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.