హైదరాబాద్, సెప్టెంబర్ 19 (జనవాణి): హైటెక్ సిటీ సమీపంలోని హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. మహిళపై దాడి చేసింది రైల్వే పోలీసు కాదని స్పష్టం చేసింది. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఓ హోంగార్డు ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించింది.
సదరు హోంగార్డు డిప్యూటేషన్‌పై హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఘటనపై విచారణ అనంతరం అతడిని తెలంగాణ పోలీస్ శాఖకు అప్పగించినట్లు పేర్కొంది. అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు అప్పగించినట్లు వివరించింది.

మహిళపై దాడి.. వీడియో వైరల్
ఘటనకు ముందు మహిళ హోంగార్డును దూషించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆగ్రహానికి గురైన హోంగార్డు ఆమెపై దాడి చేసి జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు తెలిసింది. తన భార్యను వదిలేయాలని ఆమె భర్త ప్రాధేయపడినప్పటికీ హోంగార్డు వెనక్కి తగ్గలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.
Loading Tweet...
డీజీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం
హఫీజ్‌పేట ఘటనపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. ఏ స్థాయి సిబ్బంది అయినా ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని స్పష్టం చేశారు. ఇది పోలీసు శిక్షణ, ఆదేశాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. సదరు హోంగార్డు రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు. అతడిని సర్వీసు నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు.
హోంగార్డు డిస్మిస్.. పోలీసుల అదుపులోకి
డీజీపీ ఆదేశాల మేరకు వికారాబాద్‌కు చెందిన తెలంగాణ పోలీస్ హోంగార్డు ఆనంద్‌ను సర్వీసు నుంచి తొలగించారు. ఈ మేరకు వికారాబాద్ ఎస్పీ స్నేహా మెహ్రా ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హోంగార్డు ఆనంద్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు చేపట్టారు.
Loading Tweet...




















