హన్మకొండ,సెప్టెంబర్ 12 (జనవాణి): హన్మకొండ జిల్లాలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా అదృశ్యమైన ఓ మహిళను ఆమె ప్రియుడే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు, తమ ఏకాంత వీడియోలు, ఫొటోలను బయటపెడతానని ఆమె బెదిరించడంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
పెళ్లైన కొద్దికాలానికే భర్త ఆత్మహత్య
హసన్‌పర్తి మండలానికి చెందిన తౌటం స్వప్న (40)కు కమలాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంతకాలానికే ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో శాంతి లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని భావించిన స్వప్న.. శాంతి పూజలు నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కర్ణాటకలోని బళ్లారికి వెళ్లి ఓ వ్యక్తి వద్ద శాంతి పూజలు నేర్చుకుంటూ ఉండేది. బళ్లారికి రాకపోకలు సాగించే సమయంలో కర్ణాటకకు చెందిన వొద్దిరాజుల బసవరాజు (27)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
బసవరాజు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో స్వప్న అతడితో సన్నిహితంగా మెలిగినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలం తర్వాత బసవరాజు ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. దీంతో స్వప్న పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి పెంచింది. తమ మధ్య జరిగిన విషయాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, పెళ్లి చేసుకోకపోతే వాటిని బయటపెడతానని స్వప్న బసవరాజును హెచ్చరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పరువు పోతుందనే భయంతో బసవరాజు ఆమెను పెళ్లి చేసుకుంటానని మరోసారి నమ్మించాడు.
మే 15న అదృశ్యం
మే 15న బళ్లారికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పిన స్వప్న తిరిగి రాలేదు. రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో తండ్రి ఆమంచ రాజేందర్ హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీఐ మహేందర్ ఆధ్వర్యంలో, ఎస్‌ఐ సుజిత్ నేతృత్వంలో పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. దర్యాప్తులో స్వప్న అదృశ్యం వెనుక బసవరాజు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అడవిలోకి తీసుకెళ్లి హత్య
పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బసవరాజు స్వప్నను బళ్లారికి రప్పించాడు. అక్కడి నుంచి ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బసవరాజు స్వప్న గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేశాడు. తనపై అనుమానం రాకుండా రక్తపు మరకలు ఉన్న దుస్తులను పెట్రోల్‌తో తగులబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం స్వప్న ఫోన్‌ను చెరువులో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసులకు చిక్కిన నిందితుడు
సాంకేతిక ఆధారాలతో బసవరాజు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో హసన్‌పర్తి సమీపంలోని అంబాల-కమలాపూర్ రోడ్డుపై తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన బసవరాజును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో స్వప్నను తానే హత్య చేసినట్లు బసవరాజు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన హసన్‌పర్తి సీఐ మహేందర్, ఎస్‌ఐలు సుజిత్, రవి, దేవేందర్, ఏఏవో సల్మాన్ ఖాన్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.




















