హైదరాబాద్,సెప్టెంబర్ 23 (జనవాణి): హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగినికి చేదు అనుభవం ఎదురైంది. విధులకు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతున్న 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఓ సెక్యూరిటీ గార్డు పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టాడు. ఊహించని పరిణామంతో షాక్‌కు గురైన యువతి వెంటనే గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఇందిరానగర్‌లోని ఓ పీజీ హాస్టల్‌లో ఉంటోంది. మంగళవారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో విధులకు వెళ్లేందుకు ఆమె క్యాబ్ ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది.
యువతి క్యాబ్ ఎక్కుతున్న సమయంలో సమీపంలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ఒక్కసారిగా ఆమెను పక్కకు లాగాడు. అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ ఘటనతో తీవ్ర షాక్‌కు గురైన బాధితురాలు కొద్దిసేపటి తర్వాత ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి తదుపరి చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.
Loading Tweet...




















