హైదరాబాద్, ఆగస్టు 11(జనవాణి): నగరంలో పసికందు మృతదేహం మాయం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యమైంది. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చార్మినార్ ఘాన్సీబజార్‌కు చెందిన దంపతులకు ఆరు నెలల క్రితం కవలలు జన్మించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే గత శనివారం చికిత్స పొందుతూ ఓ పసికందు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పంజాగుట్ట శ్మశానవాటికలో ఖననం చేశారు.
మరో చిన్నారి కూడా ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో నిన్న(సోమవారం) రెండో చిన్నారి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు పంజాగుట్ట శ్మశానవాటికకు వచ్చారు. ఈ సమయంలో మొదటి పసికందును ఖననం చేసిన ప్రదేశంలో గుంత తీసి ఉండటాన్ని గుర్తించారు. గోతిలో మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. రెండో చిన్నారి అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్మశానవాటిక కాటికాపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పసికందు మృతదేహం ఎలా మాయమైంది? ఇందులో ఎవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.




















