బాపట్ల,అక్టోబర్ 1 (జనవాణి): బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి గ్రామ శివారులోని చెరువులో యువకుడు, మైనర్ బాలిక మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపింది. పాఠశాల వద్ద ఏర్పడిన పరిచయం అనంతరం ఇద్దరూ ఇళ్ల నుంచి అదృశ్యమయ్యారు. చివరకు చెరువు వద్ద మృతిచెందిన స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం గుంటూరు జిల్లా కాకుమాను గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు వల్లూరు గ్రామంలో నివసిస్తుండగా చదువు నిమిత్తం బాలిక కాకుమానులోని తాతయ్య, అమ్మమ్మల వద్ద ఉంటూ పాఠశాలకు వెళ్లేది.
ఆమె ప్రయాణించే స్కూల్ బస్సుకు అదే గ్రామానికి చెందిన సాంబశివరావు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు లావు విఘ్నేష్ (22) తరచూ తండ్రి పనుల నిమిత్తం పాఠశాల వద్దకు వచ్చేవాడు. ఈ క్రమంలో బాలికతో అతడికి పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఇద్దరూ మాట్లాడుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు గుర్తించారు.
ఇళ్ల నుంచి అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు
ఈ నెల 29న ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. పాఠశాలకు వెళ్లిన బాలిక ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన తాతయ్య, అమ్మమ్మ ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బంధువులు, కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కాకుమాను పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి ఫోన్ ఆధారంగా గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.
కోనంకి చెరువు వద్ద విషాదం
అయితే బుధవారం ఉదయం మార్టూరు మండలం కోనంకి గ్రామ శివారులోని చెరువు వద్ద ఇద్దరూ ఉన్నట్లు స్థానికులకు సమాచారం అందింది. అనంతరం వారు చెరువులోకి వెళ్లినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో గాలింపు చేపట్టారు. కొంతసేపటి తర్వాత ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
కేసు పరిధిపై స్పష్టత కోసం చర్యలు
పోలీసులు మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలిక అదృశ్యంపై ఇప్పటికే కాకుమాను పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే మృతదేహాలు లభించిన ప్రాంతం మార్టూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండటంతో కేసు తదుపరి దర్యాప్తు ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో కొనసాగించాలనే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారుల మార్గదర్శకాల మేరకు తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















