హత్య కేసులో జీవిత ఖైదు.. 40 ఏళ్లుగా పరారీ.. ప్రభుత్వ టీచర్‌గా సేవలు, పెన్షన్ కూడా!

హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ పెరోల్‌పై బయటకు వచ్చి తిరిగి జైలుకు వెళ్లకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగాడు. ఈ కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా దాదాపు 30 ఏళ్లు పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడమే కాకుండా, పదవీ విరమణ అనంతరం పెన్షన్ కూడా తీసుకున్నాడు. చివరకు వరంగల్‌ సెంట్రల్‌ ప్రిజన్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు.

27 ఆగస్టు, 2026 1:59 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హత్య కేసులో జీవిత ఖైదు.. 40 ఏళ్లుగా పరారీ.. ప్రభుత్వ టీచర్‌గా సేవలు, పెన్షన్ కూడా!

హత్య కేసులో జీవిత ఖైదు పడిన ఓ వ్యక్తి పెరోల్‌పై బయటకు వచ్చి తిరిగి జైలుకు వెళ్లకుండా నాలుగు దశాబ్దాలకు పైగా తప్పించుకుని తిరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కాలంలో అతడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా దాదాపు 30 ఏళ్లపాటు ఉద్యోగం చేశాడు. ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్నాడు. 2013లో పదవీ విరమణ చేసి పెన్షన్‌ కూడా పొందుతున్నాడు.

అసలు ఏం జరిగింది?

మహబూబాబాద్‌ జిల్లా పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందుల వీరన్నపై 1982లో హత్య కేసు నమోదైంది. విచారణ అనంతరం 1983 జూన్‌ 9న వరంగల్‌ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆయనకు జీవిత ఖైదు విధించారు. దీంతో వీరన్నను వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. అదే ఏడాది డిసెంబరు 17న 30 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన వీరన్నకు 1984 మార్చి 17 వరకు గడువు పొడిగించారు. అయితే మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన తిరిగి వెళ్లలేదు. అప్పటి నుంచి సుమారు 40 ఏళ్ల 58 రోజులపాటు పోలీసులకు చిక్కకుండా బయటే ఉన్నాడు. ఈ సమయంలో వీరన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి దాదాపు మూడు దశాబ్దాలపాటు సేవలందించాడు. 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును సైతం అందుకున్నాడు. 2013లో ఉద్యోగ విరమణ చేసి పెన్షన్‌ పొందుతూ జీవించాడు.

చివరకు టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు

ఏళ్ల తరబడి తప్పించుకుని తిరిగిన వీరన్న ఆచూకీని వరంగల్‌ సెంట్రల్‌ ప్రిజన్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ గుర్తించింది. 2024 మే 16న అతడిని అరెస్టు చేసి తిరిగి జైలుకు తరలించారు. అనంతరం 2024 సెప్టెంబరు 10న వీరన్నకు మరోసారి 27 రోజుల పెరోల్‌ మంజూరైంది. అయితే నిబంధనలను ఉల్లంఘించడంతో జైలు అధికారులు ఆ పెరోల్‌ను రద్దు చేశారు. అలాగే మూడేళ్లపాటు పెరోల్‌ ఇవ్వకూడదని నిర్ణయించారు.

హైకోర్టును ఆశ్రయించిన భార్య

ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ వీరన్న భార్య సండెల చారమ్మ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ టి. మాధవీదేవి దానిని కొట్టివేశారు. వీరన్న ఇంతకాలం పరారీలో ఉన్నప్పటికీ అధికారులు గుర్తించలేకపోవడం, అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరి దాదాపు 30 ఏళ్లు పనిచేయడం, చివరకు పదవీ విరమణ చేసి పెన్షన్‌ పొందడం వంటి అంశాలపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పెరోల్‌పై విడుదలైన ఖైదీలు గడువు ముగిసిన వెంటనే తిరిగి జైలుకు చేరుతున్నారా? లేదా? అన్నది అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పెరోల్‌ ఖైదీల కోసం ప్రత్యేక నిఘా, పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, జైళ్ల శాఖకు సూచించింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు