హైదరాబాద్, సెప్టెంబర్ 9 (జనవాణి): హైదరాబాద్‌లో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. రుణం చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను తీవ్రంగా వేధించడంతో పాటు.. ఆమె కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన బోడుప్పల్‌లోని రాజలింగం కాలనీలో చోటుచేసుకుంది.
స్థానికంగా నివసించే ఓ మహిళ తన బంధువుల కోసం వర్ధన్ యాప్ ద్వారా నగదు రుణం తీసుకుంది. కొంతకాలంగా ఈఎంఐలు చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు ఆమెకు ఫోన్లు చేసి ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఒక నంబర్‌ను బ్లాక్ చేసినప్పటికీ వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ వేధింపులకు పాల్పడ్డారు.
ఒకానోక సందర్భంలో మరీ బరితెగించిన నిర్వాహకులు, బాధితురాలి పదవ తరగతి చదువుతున్న కుమార్తె ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి… ఆ ఫొటోలను వాట్సప్ ద్వారా బాధిత తల్లికి పంపించారు. వెంటనే లోన్ డబ్బు చెల్లించకపోతే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు.
దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు ఏం చేయాలో అర్థంకాక మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ను వెళ్లి ఫిర్యాదు చేసింది. జరిగిన సంఘటనను మొత్తం పోలీసులకు వివరించింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు లోన్ యాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.




















