హైదరాబాద్, సెప్టెంబర్ 7 (జనవాణి): ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు ఆమె ప్రయత్నించగా కుటుంబ సభ్యులు గుర్తించి అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన ఫోక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఫోక్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడని మాధురి రాథోడ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈశ్వర్ సాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే తన ఫిర్యాదుపై పోలీసులు ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మాధురి ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
అసలు వివాదం ఏంటి?
ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి పలు ఫోక్ పాటల్లో పనిచేశారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాతిరి రాతిరి రాతిరిలో’, ‘ప్రమీల’ వంటి పాటలు మంచి గుర్తింపు పొందాయి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈశ్వర్ సాయికి శరణ్య అనే మహిళతో ఇప్పటికే వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ‘బాసింగ బలాలు’ పాటతో ఈశ్వర్ సాయికి మరింత గుర్తింపు వచ్చింది.
ఇదిలా ఉండగా, ఈశ్వర్ సాయి భార్య శరణ్య మాధురి రాథోడ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. వేములవాడలోని రెడ్డి భవన్‌లోని ఓ గదిలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి ఉండగా తాను పట్టుకున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో శరణ్య తన భర్తతో పాటు మాధురిని ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది. అంతేకాకుండా శరణ్యతో పాటు మరికొందరు మాధురిపై చేయి చేసుకున్నట్లు కూడా వీడియోలో కనిపించింది. వీడియో వైరల్ కావడంతో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల వ్యవహారం బహిరంగ చర్చకు వచ్చింది. తన భర్తను మాధురి రాథోడ్ తన వలలో వేసుకుందని శరణ్య ఆరోపించారు. గతంలో మాధురికి బ్రేకప్ జరిగిన సమయంలో తానే ఆమెకు అండగా నిలిచానని, అలాంటి మాధురి తన భర్తతో సన్నిహితంగా ఉండటం తనను తీవ్రంగా బాధించిందని శరణ్య పేర్కొన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈశ్వర్ సాయిపై నమోదైన కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఘటనతో ఈ వివాదం మరింత తీవ్ర చర్చకు దారితీసింది.




















