భార్య ముక్కును కొరికేసిన భర్త.. కట్నం వేధింపులకు పరాకాష్ఠ!

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం కొంతకాలంగా భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తి.. కుటుంబ వివాదంలో ఆమె తండ్రిపై దాడికి యత్నించాడు. తండ్రిని కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన భార్యపై తీవ్ర ఆగ్రహంతో దాడి చేసి, ఆమె ముక్కును దంతాలతో కొరికేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

16 సెప్టెంబర్, 2026 3:34 PM•ByNarender Kumar Nangunoori

Share this article

భార్య ముక్కును కొరికేసిన భర్త.. కట్నం వేధింపులకు పరాకాష్ఠ!

మంచిర్యాల,సెప్టెంబర్ 16 (జనవాణి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఓ భర్త.. కుటుంబ వివాదంలో విచక్షణ కోల్పోయి ఆమె ముక్కును దంతాలతో కొరికేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

తొమ్మిదేళ్ల క్రితం వివాహం

కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మమతకు, అదే మండలం మల్లంపేటకు చెందిన ఎనగందుల మణిచందర్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో అదనపు కట్నం వివాదం మొదలైంది. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గత నాలుగేళ్లుగా మణిచందర్ అదనపు కట్నం కోసం మమతను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. మద్యానికి కూడా బానిస కావడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని వారు తెలిపారు.

తండ్రిని కాపాడేందుకు అడ్డుగా వెళ్లగా..

వేధింపులు భరించలేక మమత పది రోజుల క్రితం ఇద్దరు కుమార్తెలతో కలిసి కోటపల్లిలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. అయితే మణిచందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారింటికి వెళ్లి అక్కడ కూడా గొడవకు దిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మమత తండ్రి నారాయణపై మణిచందర్ దాడికి యత్నించగా.. తండ్రిని కాపాడేందుకు మమత అడ్డుగా వెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన మణిచందర్ ఆమెపై దాడి చేసి, ముక్కును దంతాలతో గట్టిగా కొరికినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఎంజీఎంలో చికిత్స

దాడిలో మమత ముక్కుకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కోటపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు