హైదరాబాద్,సెప్టెంబర్ 22 (జనవాణి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ ఎన్. లక్ష్మీభాస్కర్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
లక్ష్మీభాస్కర్‌కు చెందిన హైదరాబాద్ ఎర్రగడ్డలోని నివాసంతో పాటు మరో ఏడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కూకట్‌పల్లి, మణికొండ, పేట్ బషీరాబాద్ ప్రాంతాల్లో ఆయనకు ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట్‌లో నాలుగు ఓపెన్ ప్లాట్లు, విశాఖపట్నంలో 800 చదరపు గజాల ఓపెన్ ప్లాట్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.41 లక్షలు, పోస్టాఫీసులో రూ.12 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లో రూ.35 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.29.55 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు తెలిపారు.
సోదాల్లో 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జాగ్వార్, ఆడీ, టాటా నెక్సాన్ కార్లతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్, వెస్పా, యాక్టివా, యమహా ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు రూ.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర ఆధారాల ఆధారంగా లక్ష్మీభాస్కర్‌కు చెందిన ఆస్తుల మొత్తం విలువ రూ.6.13 కోట్లు ఉంటుందని ఏసీబీ ప్రాథమికంగా లెక్కించింది. అదనపు ఆస్తులపై ప్రస్తుతం వెరిఫికేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, వివాదంలో ఉన్న ఓ ఫ్లాట్ కొనుగోలుకు రూ.1.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సోదాల్లో గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. అలాగే తన సన్నిహితులకు రూ.1.33 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను దర్యాప్తులో వెల్లడించనున్నట్లు ఏసీబీ పేర్కొంది.




















