ఆరుగురు విద్యార్థుల మృతి.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్ అరెస్ట్

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్లలో ఆరుగురు విద్యార్థులు చెరువులో పడి మృతిచెందిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్‌ను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మృతదేహాల పోస్టుమార్టం సందర్భంగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకోబోమని బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి.

17 సెప్టెంబర్, 2026 11:30 AM•ByNarender Kumar Nangunoori

Share this article

ఆరుగురు విద్యార్థుల మృతి.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్ అరెస్ట్

సంగారెడ్డి, సెప్టెంబర్ 17 (జనవాణి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్లలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్‌ను అరెస్ట్ చేసిన పటాన్‌చెరు పోలీసులు అనంతరం అతనిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

బుధవారం వినాయక నిమజ్జనం కోసం వెళ్లిన ఆరుగురు విద్యార్థులు నేరేడు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనకు సంబంధించి బాధ్యత, నిర్లక్ష్యం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోస్టుమార్టం వద్ద ఉద్రిక్తత

మృతిచెందిన విద్యార్థుల మృతదేహాలకు పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. తమ పిల్లలను కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకోబోమని కుటుంబ సభ్యులు, బంధువులు స్పష్టం చేయడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారిని నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రకటించారు. ఆరుగురు విద్యార్థుల కుటుంబాల్లో నాలుగు కుటుంబాలకు కలెక్టర్ ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందజేశారు. అయితే మిగిలిన రెండు కుటుంబాలు చెక్కులు తీసుకునేందుకు నిరాకరించాయి. తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరాయి. దీంతో విద్యార్థుల మృతి ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాల ఆందోళన కొనసాగుతోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు