వరంగల్, ఆగస్టు 22 (జనవాణి): మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన ఓ బెటాలియన్ కానిస్టేబుల్‌పై బీట్ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా ఉర్సుగుట్టలో చోటుచేసుకుంది. ఉర్సుగుట్ట వద్ద ఉన్న ఓ బార్‌లో బెటాలియన్ కానిస్టేబుల్ మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నాడని బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసు కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డిపై చెంపదెబ్బ కొట్టాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహించిన సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనను చూసిన స్థానికులు అక్కడకు చేరుకున్నారు. బార్‌లో ప్రారంభమైన గొడవ పోలీసుల మధ్య ఘర్షణకు దారితీయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసు శాఖ తీసుకునే చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది.




















