హైదరాబాద్, ఆగస్టు 5(జనవాణి): తెలంగాణలో అత్యవసర సేవల వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బుధవారం డయల్ 112 సేవలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ.. డయల్ 112 ద్వారా 18 రకాల అత్యవసర సేవలు ఒకే నంబర్‌లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పోలీసు సహాయంతో పాటు ఫైర్ సర్వీసులు, అంబులెన్స్, న్యాయ సహాయం, వైద్య సహాయం, సైబర్ సాయం వంటి సేవలను కూడా ఈ వ్యవస్థ ద్వారా పొందవచ్చని చెప్పారు.
ఒకే నంబర్.. సమగ్ర సేవలు
డయల్ 112కు వచ్చిన ప్రతి కాల్‌కు తప్పనిసరిగా స్పందిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్‌ను తిరస్కరించబోమని పేర్కొన్నారు. TGICCC (తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్) నుంచి ఈ సేవలను పర్యవేక్షిస్తూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.
AI, డ్రోన్ టెక్నాలజీతో ఆధునిక పోలీసింగ్
డయల్ 112కు కాల్ వచ్చిన వెంటనే కాలర్ లొకేషన్‌ను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని డీజీపీ తెలిపారు. త్వరలోనే డ్రోన్ ఆధారిత సాంకేతిక వ్యవస్థను కూడా తెలంగాణ పోలీసులు వినియోగించనున్నారని వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రోన్ టీమ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
అలాగే యువ ఏపీఎస్‌లు, ఏఐ టెక్నాలజీ వాడే వారిని ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నామని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు. ఐటీ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వినియోగించే నిపుణులను ఈ వ్యవస్థలో భాగస్వామ్యం చేసి టెక్నాలజీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పర్యవేక్షణ
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని టవర్-బీలో రెండు అంతస్తులను డయల్ 112 సేవల నిర్వహణకు కేటాయించినట్లు డీజీపీ వెల్లడించారు. గతంలో ప్రారంభించిన డయల్ 100 సేవలను మరింత ఆధునికంగా తీర్చిదిద్ది, ఇప్పుడు డయల్ 112 వెర్షన్ 3.0గా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.




















