భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 18 (జనవాణి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంచం తీసుకుంటూ హాస్టల్ వార్డెన్ ఏసీబీకి పట్టుబడ్డారు. చర్ల మండలం సత్యనారాయణపురంలోని ఎస్టీ బాలుర ఇన్‌చార్జ్ హాస్టల్ వార్డెన్/రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న భూక్యా వాలుసింహను ఏసీబీ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
ఓ మహిళా ఉద్యోగి హాజరు విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఆగస్టులో ఆమె ఆరు రోజుల గైర్హాజరును అనధికారిక గైర్హాజరుగా నమోదు చేయకుండా, భవిష్యత్తులో సర్వీసులో ఇబ్బందులు రాకుండా చూడటంతో పాటు జీతం బిల్లుల తయారీలో సమస్యలు లేకుండా సహాయం చేస్తానంటూ వాలుసింహ తొలుత రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
చర్చల అనంతరం లంచం మొత్తాన్ని రూ.14 వేలకు తగ్గించారు. ఈ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి వాలుసింహను పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.




















