వీఆర్కే డైట్‌ సెంటర్‌పై ఫిర్యాదు..వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు

వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్ వ్యవస్థాపకుడు వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న తనకు ఇన్సులిన్ ఆపేయాలని సూచించారని, ఆ తర్వాత డయాబెటిక్ కీటోయాసిడోసిస్, తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

30 సెప్టెంబర్, 2026 5:27 PM•ByNarender Kumar Nangunoori

Share this article

వీఆర్కే డైట్‌ సెంటర్‌పై ఫిర్యాదు..వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (జనవాణి): వీఆర్కే డైట్‌తో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన వీరమాచినేని రామకృష్ణకు షాక్ తగిలింది. ఆయన నిర్వహిస్తున్న వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్‌పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లాకు చెందిన ఓ టైప్-1 డయాబెటిస్ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వీడియోలు చూసి వీఆర్కే సెంటర్‌కు..

నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువకుడు టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నాడు. సోషల్ మీడియాలో వీరమాచినేని రామకృష్ణకు సంబంధించిన వీడియోలు చూసిన అతడు.. తన సమస్య నయమవుతుందనే నమ్మకంతో హైదరాబాద్ షేక్‌పేటలోని వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్‌ను సంప్రదించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు వీరమాచినేని రామకృష్ణ, ఆయన సహాయకుడు డా. కోటేశ్వరరావు ఇన్సులిన్ వాడకాన్ని నిలిపివేయాలని సూచించారని బాధితుడు ఆరోపించాడు. డయాబెటిస్‌ను తగ్గిస్తామని చెప్పి తన నుంచి రూ.26 వేల ఫీజు తీసుకున్నారని పేర్కొన్నాడు.

ఇన్సులిన్ ఆపేసిన రెండు రోజులకే ఆరోగ్యం విషమం

వారి సూచనల మేరకు ఇన్సులిన్ తీసుకోవడం నిలిపివేసిన రెండు రోజులకే తన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని బాధితుడు తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో డయాబెటిక్ కీటోయాసిడోసిస్ (DKA), తీవ్ర డీహైడ్రేషన్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తాను మోసపోయినట్లు భావించిన బాధితుడు వీరమాచినేని రామకృష్ణ, డా. కోటేశ్వరరావులపై పోలీసులను ఆశ్రయించాడు.

పలు సెక్షన్ల కింద కేసు

బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీసులు మోసం, ప్రాణాలకు హాని కలిగించడం, నేరపూరిత కుట్ర తదితర ఆరోపణలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అలాగే నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చట్టం, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టంలోని నిబంధనలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించిన బాధితుడు

మరోవైపు.. చికిత్స పేరుతో తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ఆరోపిస్తూ బాధితుడు నాంపల్లి కన్జ్యూమర్ కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. సరైన వైద్య అర్హతలు లేకుండా చికిత్స అందించారనే ఆరోపణలపై పరిహారం కోరినట్లు తెలుస్తోంది. ఈ కేసులో చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఫిర్యాదుదారుడి వాదనలుగా ఉన్నాయి. పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా కేసు తదుపరి పరిణామాలు ఉండనున్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు