వరంగల్, జులై 29: వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ శాకంబరి నవరాత్ర మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. గత 15 రోజులుగా ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చివరి రోజైన నేడు అమ్మవారు సంపూర్ణ శాఖంబరి దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనం ఇస్తున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారిని సుమారు 40 రకాల కూరగాయలు, 22 రకాల పండ్లతో అద్భుతంగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం అవసరమైన కూరగాయలు, పండ్లను బెంగళూరు, సికింద్రాబాద్ మోండా మార్కెట్, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నుంచి ప్రత్యేకంగా కొనుగోలు చేశారు.
ప్రకృతి సస్యశ్యామలం కావాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పంటలు పండాలని ఆకాంక్షిస్తూ 15 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకంబరి దేవి అన్నపూర్ణ స్వరూపిణిగా భావించే ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు.
ఉదయం 10 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. భారీగా తరలివస్తున్న భక్తుల దృష్ట్యా దేవదాయ శాఖ ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్లు, తాగునీరు, భద్రత, ప్రసాదాల పంపిణీ తదితర అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
శాకంబరి నవరాత్రుల చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.




















