న్యూఢిల్లీ, ఆగస్టు 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేఓసీ-2 (ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్) డిప్‌సైడ్ కోల్ బ్లాక్ సింగరేణి సంస్థకు దక్కడం సంతోషకరమైన పరిణామమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, యాజమాన్యం, తెలంగాణ ప్రజలకు ఓ ప్రకటనలో ఆయన అభినందనలు తెలిపారు.
ఇటీవల ఒడిశాలోని నైని కోల్ బ్లాక్, తాడిచర్ల-2 బ్లాక్ సింగరేణికి దక్కిన అనంతరం పీకేఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను కూడా సంస్థకే కేటాయించాలని కార్మిక సంఘాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ బ్లాక్ సింగరేణికి దక్కేలా కేంద్ర స్థాయిలో ప్రత్యేక చొరవ తీసుకున్నామని, వేలం ప్రక్రియ పూర్తికావడంతో ఈ బ్లాక్ సింగరేణికి కేటాయించబడిందని పేర్కొన్నారు. పీకేఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్‌లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఏడాదికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 సంవత్సరాలపాటు ఈ గనిలో ఉత్పత్తి కొనసాగుతుందని చెప్పారు. మంచి నాణ్యత కలిగిన జీ-8 గ్రేడ్ బొగ్గు లభించడం వల్ల సుమారు రూ.43 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకుపైగా ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ బ్లాక్‌తో తెలంగాణ ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని, సింగరేణి భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన వనరులు సమకూరుతాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి, విద్యుత్ రంగానికి, సింగరేణి సంస్థకు, ఉద్యోగులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. నైని, తాడిచర్ల-2, పీకేఓసీ-2 బ్లాకులు సింగరేణికి దక్కడంతో మొత్తం 860 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఈ మూడు బ్లాకుల ద్వారా సుమారు 6,500 మందికి ఉపాధి లభిస్తుందని, సగటున 35 సంవత్సరాలపాటు ఏటా 22 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. వీటి ద్వారా సింగరేణికి రూ.1.95 లక్షల కోట్లకు పైగా ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.48 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సింగరేణికి వరుసగా మూడు బొగ్గు బ్లాకులు దక్కడం సంస్థ అభివృద్ధికి, తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి శుభపరిణామమని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ విజయం సాధ్యమైందని పేర్కొంటూ మరోసారి సింగరేణి కార్మికులు, అధికారులు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.





















