తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి బతికున్నప్పుడు నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు చనిపోయిన తర్వాత రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీఆర్ఎస్, కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ పెద్ది సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ అవమానించిందని పొంగులేటి ఆరోపించారు. అదే సమయంలో సంతోష్ రావు, దామోదర్ రావు వంటి వారికి రాజ్యసభ పదవులు ఇచ్చారని తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయనకు రాజ్యసభ గానీ, ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉద్యమకారులను ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకోవడం, అధికారాన్ని, కీలక పదవులను కల్వకుంట్ల కుటుంబానికే పరిమితం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసిందని పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఆయన మరణానంతరం అధికారిక పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి గౌరవించిందని పేర్కొన్నారు. మరణాలను సైతం రాజకీయ లబ్ధి కోసం వినియోగించే నీచానికి బీఆర్ఎస్ పార్టీ దిగజారిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు.





















