సిరిసిల్ల, జూలై 30: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడు జంక్షన్‌ను రూ.3.22 కోట్లతో అభివృద్ధి చేసి సుందరీకరించడంతో పాటు బస్ షెల్టర్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఐడీఓసీలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సిరిసిల్ల నేతన్నల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేనేత రంగం అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని చెప్పారు.
గత ప్రభుత్వం అమలు చేసిన బతుకమ్మ చీరల పథకం కొనసాగుతుందా అనే సందేహం నేతన్నల్లో ఉండేదని, అయితే ప్రస్తుత ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పిస్తూ నాణ్యమైన చీరలను తయారు చేయించి మహిళలకు అందజేస్తోందని తెలిపారు. దీంతో ఒకవైపు నేతన్నలకు ఉపాధి లభిస్తుండగా, మరోవైపు రాష్ట్ర మహిళలకు నాణ్యమైన చీరలు అందుతున్నాయని పేర్కొన్నారు.
సిరిసిల్ల చేనేత చీరలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని మంత్రి అన్నారు. రగుడు జంక్షన్ వద్ద నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని, ప్రతి ఏడాది ఆగస్టు 7న అక్కడ నేతన్నలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిని సిరిసిల్లకు తీసుకువచ్చి చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశానని గుర్తు చేశారు. జిల్లా ప్రజాప్రతినిధులందరూ సిరిసిల్ల నేతన్నలకు అండగా ఉంటారని, చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్యాత్మిక, శ్రామిక సంపదకు ప్రతీక అని, రాజరాజేశ్వర స్వామి క్షేత్రంతో పాటు రాజరాజేశ్వర జలాశయం ఈ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. నేతన్నలు, గీత కార్మికులు ఈ జిల్లా అభివృద్ధిలో కీలక భాగస్వాములని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.




















