భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో తన వద్ద ఉన్న డబ్బులు తీసుకుని, పెళ్లి పేరుతో లైంగికంగా వేధించాడని మీడియా రంగానికి చెందిన 22 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 69, 351(2) కింద కేసులు నమోదు చేశారు.
2022లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రేగా కాంతారావు తనను ఫ్లాట్‌కు పిలిచాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. కొత్త యూట్యూబ్ ఛానల్ నిర్మాణం పేరుతో పరిచయం పెంచుకుని దగ్గరయ్యాడని తెలిపింది. అప్పటి నుంచి ఫ్లాట్‌కు పిలిచి వేధించేవాడని.. పెళ్లి పేరుతో తనకు దగ్గరై శారీరకంగా వాడుకున్నాడని తెలిపింది. తనకు తెలియకుండా ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి, వాటితో బ్లాక్‌మెయిల్ చేసేవాడని చెప్పింది.
అలాగే రియల్ ఎస్టేట్ పేరుతో తన వద్ద నాలుగు లక్షలు తీసుకుని మోసం చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. తన ఫోన్ యాక్సిస్ చేసి, తన స్నేహితురాలికి సైతం ఇదే రీతిలో మెసేజ్‌లు చేసి దగ్గరయ్యాడని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 26వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. బీఎన్ఎస్ సెక్షన్ 69, 351(2) కింద కేసులు నమోుద చేశారు.





















