ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 4: రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు మంగళవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ జాగిలం సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఆర్‌ఐ (అడ్మిన్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో పాన్‌షాపులు, కిరాణా దుకాణాలు, బస్టాండ్‌లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, క్రయవిక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి దుష్పరిణామాలపై విద్యార్థులు, యువత, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
డ్రగ్స్ లేదా గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 8712671111కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.





















