రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 1: ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును ఆగస్టు 10 వరకు ఎన్నికల సంఘం పొడిగించిందని, ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ, ఎస్ఐఆర్ షెడ్యూల్, ఓటర్ల నమోదు, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా వివరించారు. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 549 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. వీటిలో వేములవాడలో 262, సిరిసిల్లలో 287 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లాలో 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు ఏవీ లేవని స్పష్టం చేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ జిల్లాలో వేగంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 87.42 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని, అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు వివరించారు.
ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదై ఉండరాదని ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగర్వాల్ స్పష్టం చేశారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు ఫారం-6 ద్వారా, అదే లేదా ఇతర నియోజకవర్గానికి ఓటును బదిలీ (షిఫ్టింగ్) చేసుకోవాలనుకునే వారు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ దరఖాస్తులను ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు సమర్పించవచ్చని తెలిపారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సహకరించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కె.ఎస్.బి. కుమారి, పర్యవేక్షకులు ప్రవీణ్, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్ రెహమాన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.





















