అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ బిడ్డ మృతిచెందింది. న్యూజెర్సీలో సిగ్నల్ వద్ద ఆగిన ఓ కారును వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ మరణవార్తతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మాడుగుల మండల కేంద్రానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతుల కుమార్తె అయిన దీపారెడ్డికి 20 ఏళ్ల కిందట ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డితో వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తూ అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం నాడు దీపా రెడ్డి తన కారులో వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు దీపారెడ్డి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీపారెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందింది.
మృతురాలికి ఇద్దరు కూతుళ్లు సంస్కృత, హర్షిత ఉన్నారు. కాగా, అమెరికాలో దీపారెడ్డి మరణించిందన్న వార్తతో ఆకుతోటపల్లితో పాటు ఆమె స్వగ్రామమైన మాడుగులలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




















