హైదరాబాద్, ఆగస్టు 1: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువును ఆగస్టు 15 వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, రెసిడెన్షియల్, సంక్షేమ, మోడల్, కేజీబీవీ, టీజీఎంఆర్‌జేసీ, బీసీ వెల్ఫేర్, ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
అడ్మిషన్ల సమయంలో అమల్లో ఉన్న రిజర్వేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. కేవలం జీపీఏ, సబ్జెక్ట్ గ్రేడ్ పాయింట్లు లేదా అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని.. ఎలాంటి అదనపు పరీక్షలు నిర్వహించరాదని హెచ్చరించింది. అలాగే అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలని పేర్కొంది.
ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అనుమతించిన సెక్షన్లలోనే, ఒక్కో సెక్షన్‌లో గరిష్ఠంగా 88 మంది విద్యార్థులతో మాత్రమే అడ్మిషన్లు చేపట్టాలని ఆదేశించింది. అదనపు సెక్షన్లు లేదా బోర్డు రద్దు చేసిన కోర్సుల్లో ప్రవేశాలు ఇస్తే జరిమానాతో పాటు కాలేజీ గుర్తింపు రద్దు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేటాయింపు జరిగిన, ఖాళీ ఉన్న సీట్ల వివరాలను కాలేజీ ఎంట్రన్స్ వద్ద ప్రదర్శించాలని సూచించింది.
అడ్మిషన్ల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో తప్పనిసరిగా యాంటీ డ్రగ్ డిక్లరేషన్ తీసుకోవాలని, బాలికల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బోర్డు సూచించింది. విదేశీ విద్యార్థులు లేదా ఓసీఐ కార్డుదారుల అడ్మిషన్లకు సంబంధించి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం–2025 నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది.
విద్యార్థులు, తల్లిదండ్రులు టీజీబీఐఈ అనుబంధం పొందిన జూనియర్ కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు పొందాలని బోర్డు సూచించింది. అనుబంధ కళాశాలల జాబితా అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది.





















