హైదరాబాద్, ఆగస్టు 20 (జనవాణి): తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ స్కీమ్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ హైవే, రామోజీ ఫిలిం సిటీ వద్ద పలు పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన విద్యార్థులు.. తమకు ఇంగ్లీష్ రాదంటున్న సీఎం రేవంత్ రెడ్డికి కనీసం తెలుగులోనైనా రాయడం వచ్చా..? అని విద్యార్థులు నిలదీశారు. తమకు చదువు రాదనడానికి మీకేం రైట్స్ ఉన్నయ్ సర్ అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. మాకు లెటర్ రాయడం రాదంటున్నారు.. మేము పాలిటెక్నీక్ చదువుకుంటున్న విద్యార్థులం సార్.. మాకు చదువు రాదని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శక్తి స్కీమ్‌పై విద్యార్థుల ఆందోళన
పాలిటెక్నిక్ విద్యార్థులను శక్తి స్కీమ్‌లోకి తీసుకెళ్లడం వల్ల తమకు ప్రయోజనం లేదని విద్యార్థులు వాపోయారు. ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందడం లేదని ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యను మెరుగుపరచాలంటే ముందుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ నైపుణ్యాలు నేర్చుకుంటున్నామని.. ఆ తర్వాత బీటెక్ ద్వారా మరింత ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని విద్యార్థులు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ విద్యను ఇతర కోర్సులతో కలపడం వల్ల తమ భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసులపై విద్యార్థుల ఆరోపణలు
నిరసన సందర్భంగా పోలీసులు తమపై దాడి చేశారని కొందరు విద్యార్థులు ఆరోపించారు. మహిళా విద్యార్థులపైనా పోలీసులు దురుసుగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఏబీవీపీ మద్దతు
పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ స్కీమ్‌లో విలీనం చేయడం చారిత్రక తప్పిదమని ఏబీవీపీ (ABVP) విమర్శించింది. విద్యార్థుల నిరసనలకు మద్దతు ప్రకటిస్తూ జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది.
బీఆర్ఎస్ మద్దతు
పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు బీఆర్ఎస్ (BRS) కూడా మద్దతు తెలిపింది. నాగార్జునసాగర్‌లో బీఆర్ఎస్ నేతలు నోముల భగత్, రాకేష్ రెడ్డిలు విద్యార్థులతో కలిసి NH-565పై బైఠాయించారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. మూడేళ్ల ప్రాక్టికల్ ఆధారిత పాలిటెక్నిక్ విద్యను ఐటీఐ విద్యతో కలపడం సరికాదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. జీవో 97ను రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.




















