హనుమకొండ,సెప్టెంబర్ 5 (జనవాణి): కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ నిరసన చేపట్టారు. మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
హనుమకొండలోని ఏకశిలా పార్కు (ప్రొఫెసర్ జయశంకర్ సర్ స్మృతి వనం) నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి, జీవో 97ను రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో కీలకమన్నారు. పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయకుండా విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించడం సరికాదని అన్నారు. విద్యార్థుల ప్రవేశాలు, పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జీవో 97ను రద్దు చేయాలి
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై కూడా వినయ్ భాస్కర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి, విద్యార్థులు, విద్యావేత్తలు, సంబంధిత వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సాంకేతిక విద్యలో పాలిటెక్నిక్ విద్య కీలకమైన భాగమని, వేలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఈ విద్యపై ఆధారపడుతున్నారని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే బీఆర్‌ఎస్ వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన విద్యార్థులు
ర్యాలీకి విద్యార్థులు, యువత నుంచి భారీ స్పందన లభించింది. వేలాది మంది విద్యార్థులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌లో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల హక్కుల కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడంతో పాటు, విద్యార్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని జీవో 97ను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.





















