ఈ-సిగరెట్లు, షిషా, ఫ్లేవర్డ్ హుక్కాలు యువతలో ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో.. యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆయుర్వేద హుక్కా’ తరహా తయారీని ఇందులో ఆయన వివరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ వీడియోలో సంప్రదాయ హుక్కాను పోలిన పరికరాన్ని చూపించిన బాబా రామ్‌దేవ్.. అందులో ములేఠీ (లికోరైస్), పసుపు, ఆవాలు, ఆవు నెయ్యి, కాక్రా సింగి, దేశీ కర్పూరం వంటి పదార్థాలను ఉపయోగించినట్టు పేర్కొన్నారు. ముందుగా ములేఠీని కొద్దిగా నూరి.. అందులో ఆవు నెయ్యి, పసుపు, ఆవాలు కలపాలని సూచించారు. అనంతరం ఈ మిశ్రమాన్ని హుక్కా తరహా పరికరంలో వేడిచేసి వచ్చే పొగను పీల్చే విధానాన్ని చూపించారు. ఈ పొగను పీల్చడం వల్ల ముక్కుదిబ్బడ, దగ్గు వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుందని ఆయన చెప్పినట్టు వీడియోలో ఉంది. అలాగే ఆయుర్వేదంలో పేర్కొనే వాత, పిత్త, కఫ దోషాల సమతుల్యతతోనూ ఈ విధానాన్ని ఆయన అనుసంధానించినట్టు తెలుస్తోంది.
అయితే.. ఇలాంటి సంప్రదాయ ఆరోగ్య వాదనలను వైద్యపరంగా నిరూపితమైన చికిత్సగా పరిగణించేందుకు తగిన క్లినికల్ ఆధారాలు లేవు. ఏదైనా పదార్థాన్ని కాల్చినప్పుడు ఉత్పత్తయ్యే పొగలో సూక్ష్మ కణాలు, ఇతర దహన ఉత్పత్తులు ఉండే అవకాశం ఉంది. అవి శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరవచ్చు. పొగాకును ఉపయోగించకపోయినా ఏ రకమైన పొగనైనా పీల్చడాన్ని పూర్తిగా సురక్షితమైనదిగా భావించకూడదు. దగ్గు, ముక్కుదిబ్బడ లేదా ఇతర శ్వాసకోశ సమస్యల కోసం ఇలాంటి పద్ధతులను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.
ఇక ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పొగను పీల్చడం ఆరోగ్యానికి హానికరమని కొందరు అభిప్రాయపడగా.. మరికొందరు ‘ఆయుర్వేదం పేరుతో హుక్కా.. ఇదేం కొత్త ప్రయోగం?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ విధానంపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బాబా రామ్‌దేవ్ ‘ఆయుర్వేద హుక్కా’గా చూపించిన ఈ తయారీపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు కొనసాగుతున్నాయి.
Loading Tweet...




















